కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. దీని ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావడమే మానేశారు. ఈ వైరస్ ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను ఇళ్ళకే పరిమితం చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సినిమా హాళ్ళను, షాపింగ్ మాల్స్ ను మూసివేశారు. ఇప్పుడు కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఆరు నెలల సరుకును ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందిగా మారిన వేళ… పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం, గోధుమలు,పంచదార, నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు..
కాగా దేశంలోని 75 కోట్ల కుటుంబాలు ఈ నిర్ణయం వల్ల లాభపడతాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత వరకూ ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి. కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగడం వల్ల కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్రయోజనం కలుగుతుందనే భావించాలి.