రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు పై కాలేజ్ కి తీసుకెళ్తున్న కూతురు మైత్రి (19), తండ్రి మచ్చందర్ (55)ను ఓ ట్యాంకర్ వాహనం ఢీ కొట్టింది. దీంతో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన వారు షాద్ నగర్ కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అయితే కూతురు మైత్రిని తండ్రి మచ్చందర్ కాలేజ్ కి పంపించేందుకు బైకుపై తీసుకెళ్తుండగా.. షాద్ నగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ బలంగా ఢీ కొట్టింది.
అలా వాహనం ఢీ కొన్న తాకిడికీ ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదం జరగగ్గానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడటం అక్కడ అందరినీ కన్నీరు పెట్టించింది. మైత్రీ కి వస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా తన స్నేహితురాల్లకు ఫోన్ లో తయ్యబ్ సమాచారం అందించారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.