ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నదులు పొంగి పొర్లడంతో అకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడటంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. గౌరికుండ్ దగ్గర కొండ చరియలు విరిగిపడడంతో కేదారినాథ్ వెళ్లే దారి మూసుకుపోయింది. పరిస్థితి అనుకూలంగా మారిన తరువాత యాత్రను పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. కొండ చరియల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నారు.