టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు. ఆయన కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కింగ్డమ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం జులై 31న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అయితే గతంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తప్పు పట్టారు. దీంతో ట్రైలర్ విడుదల వేడుక వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.