పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయడమే ప్రేమ అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు కానీ నిజమైన ప్రేమంటే వాళ్ళ భవిష్యత్తుకు అవసరమైన విలువలను నేర్పించడం. ఏది మంచి ఏది చెడు అని చెప్పడం కొన్నిసార్లు ‘నో’ చెప్పడం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి చాలా అవసరం. ఈ ‘నో’ అనేది వాళ్ళకి ఒక సరిహద్దును ఏర్పరిచి స్వీయ నియంత్రణ ఓపిక కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఏర్పరుస్తుంది. కానీ ఎప్పుడూ ఎలా ‘నో’ చెప్పాలి? ఎలా చెప్పినా అది పిల్లలకు బాధ కలిగించకుండా వాళ్ల మంచి కోసమే అని ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
‘నో’ చెప్పడం ఎందుకు అవసరం: పిల్లలకు సరిహద్దులను నేర్పించడం కోసం తల్లిదండ్రులు నో చెప్పడం అనేది ముఖ్యం. జీవితంలో ప్రతిదీ సులభంగా లభించదని, కొన్ని విషయాలను సాధించుకోవడానికి కష్టపడాలని వాళ్ళకి తెలుస్తుంది. ఇది వాళ్ళలో ఓపిక పట్టుదల బాధ్యతలను పెంచుతుంది. మీరు నో చెప్పినప్పుడు పిల్లలు ఇతరుల భావనను గౌరవించడం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. అంతేకాకుండా మీరు ఎప్పుడు ఎస్ మాత్రమే చెబితే వాళ్ళు నిరాశను వైఫల్యాలను తట్టుకునే శక్తిని కోల్పోతారు. అందుకే నో అనేది క్రమశిక్షణకు మొదటి మెట్టు లాంటిది.
ఏ సందర్భంలో ‘నో’ చెప్పాలి: పిల్లలు తమకు లేదా ఇతరులకు అపాయం కలిగించే పనులు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాలి. ఉదాహరణకు రోడ్డుపై ఒంటరిగా ఆడడం అపరిచితులతో మాట్లాడటం వంటివి చేస్తున్నప్పుడు పిల్లలకు నో చెప్పాలి.
అనవసరంగా స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్ వాడడం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాటులను ప్రోత్సహించకూడదు. ఈ విషయంలో పిల్లలకు ‘నో’ చెప్పి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలి.

ఇంట్లో లేదా బయట ఎవరైనా దారుణంగా ప్రవర్తించినప్పుడు ‘నో’ చెప్పాలి. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినప్పుడు ఉదాహరణకి అల్లరి చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నప్పుడు పిల్లలకు నో చెప్పాలి. పిల్లలు తమ అవసరాలకు మించి అడిగినప్పుడు అది డబ్బైనా ఇంకా ఏదైనా ‘నో’ చెప్పాలి. ఇది వాళ్ళలో ఉన్న దానితో సంతృప్తి పడే మనస్తత్వాన్ని పెంచుతుంది.
పిల్లల పెంపకంలో ‘నో’ అనేది ఒక కఠినమైన పదం కాదు, అది గొప్ప విలువలను బోధించే సాధనం నో చెప్పడం ద్వారా మీరు వారికి సరిహద్దులను బాధ్యతలను ఓపికను వైఫల్యాలను తట్టుకునే శక్తిని నేర్పిస్తారు ఇది వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ నో అనేది ప్రేమకు వ్యతిరేకం కాదు అది పిల్లల మంచి కోసం, మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం. మీ పిల్లలు మీకు నో చెప్పినప్పుడు విసుకు చెందవద్దు కానీ కొంత కాలం తర్వాత మీరు చెప్పిన ‘నో’ వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చిందో వాళ్లకు అర్థం అవుతుంది.
నో చెప్పేటప్పుడు మీ నిర్ణయానికి గల కారణాలను పిల్లలకు సున్నితంగా వివరించండి. ఇది మీపై వారికి గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.