ఏపీలో శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 24న మొదటి కార్తీక శుక్రవారం, కృష్ణమ్మకు నదిహారతి, నవంబర్ 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, నవంబర్ 5న జ్వాల తోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

శనివారం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు. దీంతో అక్టోబర్ నెల నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగనుంది. కార్తీక మాసోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు స్వామి వారి దర్శనం కోసం వెళ్తారు. మల్లన్న క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.