సృష్టికర్త బ్రహ్మకు సమమైన స్థానం పొందిన దేవశిల్పి విశ్వకర్మ. ఈయన వాస్తు శాస్త్రానికి, శిల్పకళకు అధిపతి. భారతీయ సంస్కృతిలో కళలు, చేతివృత్తులు, నిర్మాణాలకు ఈయన ఆది గురువు.ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగను జరుపుకుంటారు. అదే దేవతల వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి. ఈ రోజున విశ్వకర్మను పూజిస్తే వ్యాపారాలు వృత్తులలో వృద్ధి కలుగుతుందని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా శిల్పులు, కమ్మరి, వడ్రంగి, కంసాలి, స్వర్ణకారులు ఇతర చేతివృత్తుల వారు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
విశ్వకర్మ ఐదుగురు కుమారుల ద్వారా ఐదు ప్రధాన వృత్తులను సృష్టించారని నమ్ముతారు. ఈ వృత్తులు సమాజంలో నిర్మాణానికి, కళలకు మూల స్తంభాలుగా నిలిచాయి.అవి మన్యు (వడ్రంగి),మయ (శిల్పి),త్వష్ట (కమ్మరి),శిల్పి (కంసాలి),విశ్వజ్ఞ (స్వర్ణకారుడు) ఈ ఐదు వృత్తులు సమాజం అభివృద్ధికి, నాగరికతకు పునాదులుగా నిలిచాయి.
విశ్వకర్మ జయంతి విశిష్టత: పనిముట్లకు పూజ చేస్తారు. ఈ రోజున తమ వృత్తికి సంబంధించిన యంత్రాలు, పనిముట్లు పరికరాలను శుభ్రం చేసి పూజిస్తారు. అవి తమ జీవనోపాధికి మూలమని కృతజ్ఞతలు తెలియజేస్తారు. శిల్పులు, ఇంజనీర్లు చేతివృత్తులవారు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు తమ కృషిని, నైపుణ్యాన్ని గుర్తించుకునే రోజు ఇది. ఇక ఈరోజు విశ్వకర్మను పూజిస్తే తమ వ్యాపారాలు వృత్తులలో వృద్ధి, శ్రేయస్సు కలుగుతాయని ప్రజల నమ్మకం.

విశ్వకర్మ నిర్మించిన అద్భుతాలు: పురాణాల ప్రకారం, విశ్వకర్మ అనేక లోకాలను, దేవతల నివాసాలను ఆయుధాలను నిర్మించారు. వాటిలో మొదటిది స్వర్గలోకం ఇంద్రుని కోరిక మేరకు ఆయన నివాసమైన స్వర్గలోకాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. కృష్ణుడు ద్వారకానగరం నిర్మించారు. శ్రీహరి విష్ణువు సుదర్శన చక్రం ప్రపంచాన్ని రక్షించేందుకు విష్ణువు ఉపయోగించే సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ తయారు చేశారు. పురాణాల ప్రకారం ఈయన రావణాసురుడు కోసం లంకను సువర్ణమయమైన నగరంగా నిర్మించారు. యమధర్మరాజుకు యమదండం విశ్వకర్మ తయారు చేశారు. ఈ విధంగా విశ్వకర్మ కేవలం భవనాలను మాత్రమే కాకుండా, దేవతలకు అవసరమైన అన్ని ఆయుధాలను, సాధనాలను కూడా నిర్మించారు. అందుకే ఆయనను సమస్త కర్మలకు, సృష్టికి మూలపురుషుడిగా కీర్తిస్తారు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం పురాణ, సాంస్కృతిక విశ్వాసాలపై ఆధారపడింది. వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.