ఆకాశం పురుషులకే సొంతం అనుకునే కాలంలో కేవలం 21 ఏళ్ల వయసులో, చీరకట్టుతో కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని ఒంటరిగా నడిపిన సాహసి ఆమె. ఆమె కేవలం చరిత్ర సృష్టించడమే కాదు భారతదేశంలో వేలాది మంది మహిళా పైలట్లకు స్ఫూర్తినిచ్చారు. స్త్రీలు అడుగుపెట్టడానికి సాహసించని రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి లింగ భేదాన్ని చెరిపేసిన ఆ పయనానికి నాంది పలికిన అద్భుతమైన మహిళ సర్లా ఠక్రాల్ జీవితం గురించి తెలుసుకుందాం.
భారతదేశ విమానయాన చరిత్రలో తొలి మహిళా పైలట్‌గా సర్లా ఠక్రాల్ (Sarla Thukral) నిలిచారు. ఈమె 1914 లో ఢిల్లీలో జన్మించారు. సర్లా 16 ఏళ్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె భర్త పీ.డీ. శర్మ పైలట్ కావడం అత్తమామల ప్రోత్సాహం సర్లా జీవితాన్ని మార్చేశాయి. ఆమె భర్త కుటుంబంలో ఏకంగా తొమ్మిది మంది పైలట్లు ఉన్నారు. ఈ ప్రోత్సాహంతో సర్లా లాహోర్ ఫ్లయింగ్ క్లబ్లో శిక్షణ ప్రారంభించారు.

ఆ కాలంలో విమానం నడపడం అనేది కేవలం పురుషులు మాత్రమే చేసే పని. అలాంటి చోట భారతీయ సంప్రదాయ వస్త్రమైన చీర ధరించి 1936వ సంవత్సరంలో కేవలం 21 ఏళ్ల వయసులో, ఆమె జిప్సీ మోత్ (Gypsy Moth) అనే చిన్న విమానాన్ని ఒంటరిగా (Solo) నడిపి సంచలనం సృష్టించారు. కేవలం తొమ్మిది గంటల శిక్షణలోనే ఆమె విమానాన్ని ఒంటరిగా నడపడానికి అర్హత సాధించడం ఆమె పట్టుదల మరియు ప్రతిభకు నిదర్శనం. ఆ తర్వాత ఆమె 1000 గంటలకు పైగా విమానం నడిపి “A” పైలట్ లైసెన్స్ పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
దురదృష్టవశాత్తు ఆమె భర్త విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వాణిజ్య పైలట్ లైసెన్స్ కోసం ఆమె ప్రయత్నించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో పౌర విమానయాన శిక్షణ నిలిచిపోయింది. దీంతో ఆమె తన దృష్టిని కళలు వ్యాపార రంగాలపై కేంద్రీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా చిత్రకారిణిగా జీవించారు. అయినప్పటికీ విమానయానంలో ఆమె సృష్టించిన చరిత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు ప్రపంచంలో అత్యధిక మహిళా పైలట్లు ఉన్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉండటానికి ఆమె వేసిన తొలి అడుగులే మూల కారణం.
సర్లా ఠక్రాల్ ప్రయాణం కేవలం గగనతలంపై విమానం నడపడం మాత్రమే కాదు ఇది సామాజిక కట్టుబాట్లను లింగ వివక్షను ఛేదించి భారతీయ మహిళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన విజయం. ఆమె ధైర్యం పట్టుదల భారతదేశ మహిళా శక్తికి ఆత్మవిశ్వాసానికి ఉన్నత శిఖరాలను అధిరోహించగల సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.
గమనిక: సర్లా ఠక్రాల్ను తొలి భారతీయ మహిళా పైలట్‌గా విస్తృతంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆమె తొలిసారిగా “A” లైసెన్స్ పొంది ఒంటరిగా విమానం నడిపారు. అయితే ఉర్మిళా కె. పారిఖ్ 1932లో తొలి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (PPL) పొందినప్పటికీ సర్లా ఠక్రాల్ పేరు బారతీయ విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా ప్రసిద్ధి చెందింది.