జీవితంలో తెలియక చేసిన పాపాలు మనిషిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుంచి విముక్తి లభించి వైకుంఠ ద్వారాలు తెరుచుకోవాలంటే? ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మనకున్న గొప్ప ఆధ్యాత్మిక మార్గమే పాశాంకుశ ఏకాదశి వ్రతం. ఆశ్వయుజ శుక్ల పక్షంలో వచ్చే ఈ పర్వదినం పాపాలను అంకుశంతో నియంత్రించి, మనిషిని మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. ఈ విశిష్ట వ్రతం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం.
పాశాంకుశ ఏకాదశి అంటే ఏమిటి: హిందూ పురాణాల ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. ‘పాప’ అంటే పాపం, ‘అంకుశం’ అంటే నియంత్రించే సాధనం. అంటే మన పాపాలను పూర్తిగా అదుపు చేసి, వాటిని తొలగించే శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పద్మనాభుని రూపంలో పూజిస్తారు.
వ్రత విశిష్టత మరియు ప్రాధాన్యత: పద్మ పురాణం మరియు ఇతర ధర్మగ్రంథాలు ఈ ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరంగా చెబుతున్నాయి. దీనిని ఆచరించడం ద్వారా అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పాప విమోచనం, ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించడం వల్ల గత జన్మల్లో లేదా ప్రస్తుత జన్మలో తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. వైకుంఠ ప్రాప్తి , వైకుంఠ ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశి కూడా వైకుంఠ మార్గాన్ని చూపుతుందని, ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేసేవారు యమ బాధల నుండి విముక్తి పొంది, విష్ణు లోకానికి చేరుకుంటారని విశ్వాసం.

సమస్త పుణ్యఫలం: కేవలం ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడం వేయి అశ్వమేధ యాగాలు మరియు వంద సూర్య యజ్ఞాలు చేసిన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు,కలిగి ఈ వ్రతం ఆచరించిన వారికి సకల సుఖాలు, సంపద, మంచి ఆరోగ్యం లభిస్తాయి.
ఆచరించాల్సిన విధానం: పాశాంకుశ ఏకాదశి నాడు భక్తులు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి విష్ణుమూర్తిని తులసి దళాలు, పసుపు పూలతో పూజించాలి. విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం, విష్ణు దేవాలయాలను దర్శించడం శుభకరం.
ముఖ్యంగా, ఈ రోజున దానధర్మాలు చేయడం చాలా ముఖ్యం. పేదవారికి, అర్చకులకు బంగారం నువ్వులు, ధాన్యం, నీరు, వస్త్రాలు మన శక్తి కొలది దానం చేయడం వల్ల అత్యధిక పుణ్యం లభిస్తుంది.ఉదయం పూజ చేయటం కుదరినివారు సాయంత్రం 6 గంటలకు పూజ చేసి, రాత్రి జాగరణ చేసి, విష్ణు భజనలతో గడపడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ద్వాదశి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి, ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి.
పాశాంకుశ ఏకాదశి కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు, ఇది మానసిక శుద్ధికి, ఆత్మ పరిశీలనకు మరియు ఆధ్యాత్మిక పురోగతికి ఉన్నతమైన అవకాశం. ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీమహావిష్ణువు కృపకు పాత్రులై జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని పండితులు తెలుపుతారు.