దీపావళి అంటే వెలుగులు సంతోషం, లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు. ఈ పండుగ రోజున మనం ఎలాంటి వస్తువులు కొంటామో, ఇంటికి తీసుకువస్తామో అనేది చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను కొంటే అదృష్టం ఐశ్వర్యం వస్తాయని నమ్ముతారు. కానీ కొన్ని ప్రత్యేక వస్తువులు మాత్రం పొరపాటున ఇంటికి తెచ్చినా ఆర్థికంగా నష్టాలు, కష్టాలు తప్పవని పెద్దలు, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ అశుభకరమైన వస్తువు ఏమిటి? మీ సంపదను కాపాడుకోవడానికి ఈ దీపావళికి మీరు దేనికి దూరంగా ఉండాలి? తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం, వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీపావళి రోజున లేదా ఆ సమయంలో పొరపాటున కూడా ఇంటికి మూసిన తాళం లేదా పాత, విరిగిన వస్తువులు తీసుకురావద్దని చెబుతారు.

మూసిన తాళం : దీపావళి లక్ష్మీదేవికి స్వాగతం పలికే పండుగ. ఈ రోజున తాళం తెచ్చుకోవడం అంటే అదృష్ట ద్వారాలను మూసివేయడం లేదా ఆర్థిక పురోగతిని బంధించడం వంటిదిగా భావిస్తారు. కొందరు పండుగ షాపింగ్‌లో భాగంగా కొత్త తాళాలు లేదా తాళాలు వేసిన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. అలాంటివి కొంటే, తాళం చెవిని ఉపయోగించి దాన్ని తెరిచి, శుభ్రం చేసి ఇంట్లో ఉంచుకోవాలి కానీ మూసిన స్థితిలో ఉంచకూడదు. ఎందుకంటే, తాళం అనేది స్థిరత్వం, బంధాన్ని సూచించినా, పండుగ సమయంలో అది డబ్బు రాకను అడ్డుకుంటుంది అని నమ్మకం.
పాత, విరిగిన లేదా పనికిరాని వస్తువులు: లక్ష్మీదేవిని స్వాగతించడానికి మనం ఇంటిని శుభ్రం చేస్తాం పాత వస్తువులను తొలగిస్తాం. అలాంటి సమయంలో మళ్ళీ పాత లేదా విరిగిన పాత్రలు, పగిలిన అద్దాలు పాత చెత్త లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనడం లేదా ఇంటికి తీసుకురావడం అశుభమని భావిస్తారు. ఇవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయని ఫలితంగా ఆర్థిక నష్టాలు, ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతారు. లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత, కొత్తదనం పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోటునే ఇష్టపడుతుంది.
దీపావళి పండుగ అంటేనే సమృద్ధి, శ్రేయస్సుకి ప్రతీక. అందుకే ఈ రోజున మీ ఇంటికి తాళం వేసిన వస్తువులు పాత లేదా విరిగిన వస్తువులు కాకుండా లక్ష్మీదేవి విగ్రహాలు, వెండి నాణేలు, కొత్త దీపాలు లేదా శుభ్రమైన వస్తువులు వంటివి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించండి. ఈ చిన్న జాగ్రత్తలు మీ జీవితంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పెంపొందించగలవు.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు కేవలం సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిష్య శాస్త్ర సలహాలు మాత్రమే.