సాహసం అంటే కేవలం కత్తి పట్టుకుని పోరాడటమే కాదు, సంప్రదాయ బంధాలను తెంచుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించడం కూడా! భారతదేశ చరిత్రలో అలాంటి చారిత్రక మహిళ ఒకరున్నారు. ఆమె జీవితమే ఒక స్ఫూర్తిదాయక గాథ. దేశంలోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన ఆ ధీర వనిత సుచేతా కృపలాని గురించి తెలుసుకుంటే మనలో ఏదో తెలియని పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆ సాహసిక ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం..
సుచేతా కృపలాని (Sucheta Kriplani) పేరు వినగానే ఒక సాహసం, తెగువ గుర్తుకొస్తాయి. 1908లో పంజాబ్‌లోని అంబాలాలో జన్మించిన సుచేత, స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న ప్రముఖ నాయకురాలు. ఆమె కేవలం రాజకీయ నాయకురాలిగానే కాకుండా అప్పటి కాంగ్రెస్ నాయకులలో ఒకరైన ఆచార్య జె.బి. కృపలానిని వివాహం చేసుకుని, అప్పటి సామాజిక అడ్డంకులను కూడా అధిగమించారు.

సుచేత జీవితంలో అత్యంత కీలక ఘట్టం స్వాతంత్య్ర పోరాటం. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా ఉంటూ, క్విట్ ఇండియా ఉద్యమం (1942) సమయంలో ఆమె చూపిన తెగువ చరిత్రలో నిలిచిపోతుంది. చాలా మంది అగ్ర నాయకులు జైలు పాలైనప్పుడు, సుచేత భూగర్భ నాయకురాలిగా మారారు. పోలీసుల కళ్లు గప్పి, రహస్యంగా ఉద్యమాన్ని నడిపించి స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఉత్తేజాన్ని అందించారు. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న సాహసం నిర్భీతి ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడతాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్‌లో సభ్యురాలిగా, లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన సుచేత కృపలాని, తన జీవితంలో అత్యంత గొప్ప ఘనతను 1963లో సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, భారతదేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ముఖ్యమంత్రిగా ఆమె తీసుకున్న అనేక నిర్ణయాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో ఆమె చూపిన దృఢత్వం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆమె పరిపాలనలో నిజాయితీ మరియు నిబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు.
సుచేతా కృపలాని కేవలం తొలి మహిళా ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఆమె జీవితం ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి ఒక స్ఫూర్తి. రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ నిజాయితీ, సాహసం, నిస్వార్థం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆమె నిరూపించారు. ఆమె గాథ భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకం.