యుద్ధభూమి అంటే భయం, నెత్తురు, మరణం, ఇవే అందరికి గుర్తుకు వస్తాయి. కానీ ఆ భయంకర వాతావరణంలో కలం పట్టి, సత్యాన్ని ప్రపంచానికి చూపిన ధైర్యశాలి ప్రభా దత్. సైనికుడి తుపాకీతో పోరాడాల్సిన చోట, తన పదునైన అక్షరాలతో వార్తలను అందించిన ఆమె గాథ భారతీయ జర్నలిజంలో ఒక సువర్ణాధ్యాయం. ఆమె కేవలం వార్తా విలేఖరి కాదు, ముక్కుసూటిగా మాట్లాడే మహిళా శక్తికి, అసమాన ధైర్యానికి ప్రతీక. భారతదేశపు తొలి మహిళా యుద్ధ విలేఖరిగా ఆమె చేసిన అద్భుత ప్రయాణం స్ఫూర్తిదాయకం. మరి ఆమె గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
యుద్ధంలో కలం పదును: ఆ రోజుల్లో మహిళా జర్నలిస్టులు ఆఫీసులకే పరిమితమైన తరుణంలో, ప్రభా దత్ యుద్ధభూమికి సాహసంతో పయనమయ్యారు. 1965 నాటి ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆమె చూపిన తెగువ మరువలేనిది. తూర్పు సరిహద్దుల్లో, మందుగుండు సామగ్రి మధ్య నిలబడి, యుద్ధ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా ఆమె రాసిన కథనాలు దేశం నలుమూలలా సంచలనం సృష్టించాయి.
ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేయడమంటే ఎలా ఉంటుందో ఆమె నిరూపించారు. ఆమె రిపోర్టింగ్ కేవలం వార్తలను అందించడం వరకే పరిమితం కాలేదు, సైనికుల మనోభావాలను, యుద్ధం వెనుక ఉన్న మానవీయ కోణాన్ని కూడా లోకానికి చాటిచెప్పింది. ఆమె కలం నుండి వచ్చిన ప్రతి పదం, వార్తల ప్రపంచంలో మహిళల పాత్రను బలంగా స్థాపించింది. ఆమె ఆ రోజుల్లోనే భారతీయ జర్నలిజంలో మహిళలకు ఒక కొత్త మార్గాన్ని చూపారు.

ధైర్యమే తన ఆయుధం, సత్యమే ఆమె లక్ష్యం: ప్రభా దత్ యొక్క జర్నలిజం కేవలం యుద్ధభూమికి మాత్రమే పరిమితం కాలేదు. సమాజంలో అణచివేయబడిన ప్రజల గొంతుకగా నిలబడ్డారు. బిళ్ళా, రంగా వంటి హత్యకేసుల్లో ఉరిశిక్ష పడిన ఖైదీలను జైల్లో కలుసుకునేందుకు, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె కోర్టులో పోరాడారు.
ఈ పోరాటం కారణంగానే, జర్నలిస్టులకు ఖైదీలను ఇంటర్వ్యూ చేసే హక్కుకు సంబంధించిన చట్టపరమైన మైలురాయి ‘ప్రభా దత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు చరిత్రలో నిలిచిపోయింది. ఆమె సాహసం, నిజాయితీ, వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం ఎంతటి ఉన్నతమైనవో ఈ సంఘటన నిరూపిస్తుంది. దురదృష్టవశాత్తు, 1984లో ఆమె అకాల మరణం భారతీయ జర్నలిజానికి తీరని లోటు. ఆమె వారసత్వాన్ని నేడు ఆమె కుమార్తె బర్ఖా దత్ ముందుకు తీసుకువెళుతున్నారు.
ప్రభా దత్ కేవలం జర్నలిస్ట్ కాదు ఆమె తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక ధైర్యానికి నిదర్శనం. పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ కలం పట్టి కష్టమైన, ప్రమాదకరమైన పనిని తన భుజాలపై వేసుకుని విజయవంతమైంది. యుద్ధభూమిలో కలం పట్టిన మహిళగా ఆమె చూపిన తెగువ, భారతీయ జర్నలిజం చరిత్రలో నిలిచే గొప్ప గాథ.
గమనిక : ప్రభా దత్ పేరు మీద సాంస్కృతిక ఫౌండేషన్ (Sanskriti Foundation) ద్వారా యువ మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించడానికి “ప్రభా దత్ ఫెలోషిప్”ను స్థాపించడం జరిగింది. ఆమె వారసత్వం నేటికీ వర్ధిల్లుతూ కొత్త తరాల జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలుస్తోంది.
