బంధం అంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. కానీ ఈ బిజీ జీవితంలో పనుల ఒత్తిడిలో దంపతులు ఒకరికొకరు సమయం ఇవ్వలేక, చిన్న చిన్న మనస్పర్థలకు చోటిస్తున్నారు. ప్రేమ నిలబడాలంటే పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు. రోజువారీ జీవితంలో మనం పాటించే అతి చిన్న అందమైన అలవాట్లే భార్యాభర్తల బంధాన్ని మరింత బలంగా, మధురంగా మారుస్తాయి. మీ రిలేషన్‌షిప్‌లో ఆ మ్యాజిక్ ఎప్పటికీ తగ్గకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ గురించి తెలుసుకోండి..
బంధాన్ని బలోపేతం చేసే చిన్న అలవాట్లు: దాంపత్య జీవితంలో బంధం బలపడాలంటే ‘కమ్యూనికేషన్’ (సంభాషణ) అనేది పునాది. ఉదయం లేవగానే చిరునవ్వుతో “గుడ్ మార్నింగ్” చెప్పడం రాత్రి పడుకునే ముందు రోజులో జరిగిన మంచి లేదా కష్టమైన విషయాలను పంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా మీ భాగస్వామి ఏదైనా చిన్న పని చేసినా ఉదాహరణకు, టీ చేసి ఇవ్వడం లేదా పాలు తీసుకురావడం లాంటివి తప్పకుండా “థాంక్యూ” చెప్పండి. ఈ చిన్న కృతజ్ఞతా భావం వారికి మీపై గౌరవాన్ని, ప్రేమను పెంచుతుంది. ఒకరిపై ఒకరికి శ్రద్ధ ఉంది అని తెలియజేయడానికి ఇది మంచి మార్గం.

నాణ్యమైన సమయం, గౌరవం: ప్రతిరోజు కొంత సమయాన్ని (కనీసం 15-20 నిమిషాలు) మొబైల్ ఫోన్లు టీవీ లేకుండా కేవలం ఒకరితో ఒకరు గడపడం అలవాటు చేసుకోండి. ఆ సమయంలో మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం, వారి అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం. కోపం వచ్చినప్పుడు లేదా గొడవ జరిగినప్పుడు కూడా ఇద్దరిలో ఒకరు మౌనంగా ఉండి, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. గతంలో జరిగిన తప్పులను పదే పదే గుర్తుచేసి నిందించడం బంధాన్ని బలహీనపరుస్తుంది. గొడవలు సహజమే కానీ వాటిని పెద్దవిగా చేయకుండా, పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు హగ్ చేసుకోవడం, చిన్న ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి.
దంపతుల బంధం అనేది ఒక మొక్కలాంటిది దానికి నిరంతరం నీరు పోస్తూ ఉండాలి. ఈ చిన్న అలవాట్లే ఆ నీరు. ప్రేమ, నమ్మకం, గౌరవం అనేవి ఏ దాంపత్య బంధానికైనా ప్రాణాధారం. వాటిని కాపాడుకుంటే మీ వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది.
