ఉరుకుల పరుగుల ఈ జీవితంలో చాలా మందికి నిద్ర అనేది ఒక సమస్య గా మారుతోంది. ముఖ్యంగా బిజీ షెడ్యూల్స్ ఉన్నవారికి, ముందుగానే నిద్రను ‘దాచుకునే’ టెక్నిక్ తెలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు.ఇలాంటి సదుపాయం వుంది అవును దీన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఇది మీరు ఒత్తిడికి గురయ్యే సమయాల్లో నిద్రలేమి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన ఆరోగ్య వ్యూహం. ముందుగా నిద్రను దాచుకోవడం ఎలాగో, దానిని సరిగ్గా వాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం ..
స్లీప్ బ్యాంకింగ్ అనేది ఏదైనా ముఖ్యమైన సంఘటన లేదా బిజీ వర్క్ వీక్ ముందు, కొన్ని రోజులు రోజువారీ కంటే అదనపు నిద్రను పొందడం. ఉదాహరణకు మీరు ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోతుంటే, రాబోయే వారం రోజులు రాత్రి 6 గంటలు మాత్రమే పడుకోవాల్సి వస్తే, ఆ ముందు వారంలో రోజుకు 30 నుండి 60 నిమిషాలు అదనంగా నిద్రపోవడం. ఇలా చేయడం వలన శరీరంలో నిల్వ అయిన నిద్ర (Sleep Reserve) వల్ల, తక్కువ నిద్ర ఉన్న రోజుల్లో అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
నిద్రను దాచుకోవడం కేవలం ఎక్కువసేపు పడుకోవడమే కాదు, క్వాలిటీ స్లీప్‌ను పెంచడం కూడా ముఖ్యం. దీని కోసం కొన్ని చిట్కాలు వున్నాయి వాటి గురించి తెలుసుకుందాం..

నిదానంగా పెంచండి: ఒకేసారి అదనంగా రెండు గంటలు పడుకోకుండా, ప్రతిరోజూ 30 నిమిషాల చొప్పున నిద్ర సమయాన్ని పెంచండి. ముఖ్యమైన పని మొదలుకావడానికి వారం ముందు నుంచే ఈ బ్యాంకింగ్ ప్రారంభించాలి.
నిర్దిష్ట సమయం: రోజువారీ నిద్ర వేళలను స్థిరంగా పాటించండి. వారాంతాల్లో కూడా నిద్రించే సమయాన్ని ఎక్కువగా మార్చవద్దు. నిద్ర వాతావరణం పడుకునే గది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోండి.
పడుకునే ముందు ప్రశాంతంగా: నిద్రకు కనీసం ఒక గంట ముందు మొబైల్, టీవీ స్క్రీన్‌లకు దూరంగా ఉండండి. ధ్యానం లేదా పుస్తకం చదవడం మంచిది.
స్లీప్ బ్యాంకింగ్ అనేది నిద్రలేమిని పూర్తిగా నివారించదు, కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు దాని దుష్ప్రభావాలను సమర్థవంతంగా తగ్గించడానికి సహాయపడుతుంది. జీవితంలో అత్యవసర సమయాల్లో మీ మనస్సు, శరీరం చురుకుగా ఉండటానికి ఇది ఒక స్మార్ట్ పద్ధతి. మీ ఆరోగ్యానికి ‘ఆర్థిక భద్రత’ కల్పించడానికి ఈ ‘స్లీప్ బ్యాంక్’ను సద్వినియోగం చేసుకోండి.
గమనిక: ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది ఒక ఆరోగ్య వ్యూహం మాత్రమే. ప్రతిరోజూ తగినంత నిద్ర (పెద్దలకు 7-9 గంటలు) అవసరం. దీర్ఘకాలికంగా నిద్రను తగ్గించుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. నిద్ర సమస్యలు అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
