ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నిలబడి ఏదో తినేసి పనికి పరుగెత్తడం చాలా మందికి అలవాటైపోయింది. ముఖ్యంగా బఫేలు, ఆఫీసుల వద్ద ఈ దృశ్యం సాధారణం. కానీ ఈ చిన్న అలవాటు మీ జీర్ణవ్యవస్థకు పెద్ద హాని కలిగిస్తుందని తెలుసా? నిలబడి తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి? వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య సమస్యలు: అజీర్ణం, గ్యాస్ నిలబడి ఆహారం తీసుకున్నప్పుడు, చాలా మంది తెలియకుండానే చాలా వేగంగా తినేస్తారు. వేగంగా తినడం వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం, అదనపు గాలిని మింగడం జరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం మరియు తీవ్రమైన అజీర్ణానికి దారితీస్తుంది. అంతేకాకుండా నిలబడి ఉన్నప్పుడు, గురుత్వాకర్షణ కారణంగా రక్తం కాళ్లవైపు నిలిచిపోతుంది. దీనివల్ల జీర్ణ అవయవాలకు రక్త సరఫరా తగ్గి, జీర్ణక్రియ మందగిస్తుంది. దీర్ఘకాలంలో, ఇది అన్నవాహికపై ఒత్తిడి పెంచి, అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు.

ఎక్కువ తినే ప్రమాదం: నిలబడి తినడం వల్ల మరొక ముఖ్య సమస్య ఏమిటంటే మనం ఎంత తింటున్నామో అనే స్పృహ మనకు సరిగా ఉండదు. కూర్చొని ప్రశాంతంగా తిన్నప్పుడు మెదడుకు ‘కడుపు నిండింది’ అనే సంకేతం అందుతుంది. కానీ నిలబడి, హడావుడిగా తింటే ఈ సంకేతం అందక, అతిగా తినే ధోరణి పెరుగుతుంది. దీని ఫలితంగా బరువు పెరగడం, స్థూలకాయం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు నిలబడి ఉన్నప్పుడు మన మనసు విశ్రాంతి తీసుకోదు, దీనివల్ల భోజనం సరిగా ఆస్వాదించలేము.
నివారణ చర్యలు: ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, చిన్న మార్పులు చాలు. ప్రతి భోజనాన్ని కూర్చొని తినడానికి ప్రయత్నించండి. నేలపై కూర్చొని లేదా డైనింగ్ టేబుల్ వద్ద ప్రశాంతంగా కూర్చుని, నెమ్మదిగా, ప్రతి ముద్దను బాగా నములుతూ తినండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక కడుపు నిండిన భావనను త్వరగా అందిస్తుంది. తినేటప్పుడు టీవీ, ఫోన్ లాంటి వాటికి దూరంగా ఉండి, ఆహారంపై మాత్రమే దృష్టి పెట్టడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనానికి ఆధారం మంచి ఆహారం మాత్రమే కాదు, దాన్ని మనం ఎలా తింటాం అనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. నిలబడి తినే అలవాటుకు వీడ్కోలు చెప్పి, ప్రశాంతంగా కూర్చుని ఆస్వాదిస్తూ తినండి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థతో మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోండి.
