పంచభక్ష పరమాన్నం తిన్నా కానీ ఆఖరున కిళ్ళీ లేనిదే తిన్న భోజనం తృప్తినివ్వదు. భోజనం చేశాక తమలపాకు కిళ్ళీ నమలాల్సిందే. అంతే కాదు ఏ శుభకార్యం చెయ్యాలన్నా తమలపాకు తాంబూలం ఉండాల్సిందే. దక్షిణ భారతదేశంలో ఏ శుభకార్యం తలపెట్టినా, పూజా కానీ, ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తె తమలపాకు తో తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టే సాంప్రదాయం ఉంది. అంటే తమలపాకు కు ఒక విశిష్ట స్థానం దక్కింది.
అయితే ఈ తమలపాకు పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలలో ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి నుంచి మొత్తం భారతదేశం అంతటా ఎగుమతి అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ తమలపాకు వినియోగం ఎక్కువ. అయితే ఇప్పుడు తమలపాకు పండించే వారి పరిస్తితి చాలా దారుణంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో తమలపాకు పండించే రైతులు నష్టపోయారు.
వేసవిలో తమలపాకు కు గిరాకీ ఉన్నప్పటికీ ఎగుమతులు లేక రైతులు నష్టపోయారు. పండిన పంటను ఏమి చెయ్యలేక తీగ నుంచి ఆకులను కోయించే స్థితి కూడా లేక, తమలపాకులు తీగమీదే పండిపోయి కుళ్ళి పోతున్నాయి. పక్క రాష్ట్రాలకు ఎగుమతి సంగతి అలా ఉంచితే కనీసం పక్క ఊరిలో ఉన్న కిళ్ళీ షాపులకు కూడా తమలపాకు అమ్మే పరిస్తితి రైతుకు లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు ఈ తమలపాకు కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.