మాట వినకుండా, లాక్ డౌన్ పాటించకుండా బయటకు వస్తే తాట తీస్తారు. అది ఎవరు అయినా ఎలాంటి వాళ్ళు అయినా సరే వెనుకాడే పరిస్థితి లేదు. ఒంటి మీద రాకెట్లు వెళ్ళడమే. అది ఎవరు అయినా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడటంలో వాళ్ళే మళ్ళీ. కరోనా మహమ్మారి ని కట్టడి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ప్రభుత్వాలకు చాలా అవసరం. వాళ్ళే పోలీసులు..
అలాంటి పోలీసులు ఇప్పుడు సహాయం చేయడంలో, పేదవాడి కడుపు నింపడంలో కూడా ముందే ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు గురువారం ఒక్కరోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,620 మందికి భోజన ప్యాకెట్లను అందించారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో రోడ్ల మీద ఆకలి కేకలను తీర్చారో అర్ధమవుతుంది. సైబరాబాద్ పోలీసులకు సహకరించడానికి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ),
మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. పేద వాళ్ళ ఆకలి తీర్చడానికి అండగా ఉంటున్నారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. కమిషనరేట్ పరిధిలోని 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వం లాక్‌డౌన్ రూల్స్ ఎత్తేసే వరకు అన్నార్థులకు సైబరాబాద్ పోలీసులు అండగా ఉంటారని ఆయన స్పష్టం చేసారు. భోజనం, నిత్యావసర వస్తువులు, మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ తదితరాలు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు.