అయ్యో! పొద్దున్నే మంచి పోషకాలను ఇస్తుందని ఆశగా కప్పు పాలు తాగి ఉంటారు. కానీ కొద్ది సేపటికే పొట్ట ఉబ్బరం గ్యాస్ లేదా విరేచనాల వంటి ఇబ్బందులు మొదలయ్యాయా? అలాంటప్పుడు “పాలేనా ఈ సమస్యకు కారణం?” అని ఆలోచించడం సహజం. చాలా మందికి ఈ అసౌకర్యానికి ప్రధాన కారణం లాక్టోస్ ఇంటాలరెన్స్ కావచ్చు. అంటే పాలల్లో ఉండే సహజ చక్కెర అయిన ‘లాక్టోస్’ను జీర్ణం చేసే ఎంజైమ్ (లాక్టేజ్) మీ శరీరంలో తగినంత లేకపోవడమే, ఇది ఏదో పెద్ద సమస్య కాదు. ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే ఈ ఇబ్బందిని తేలికగా అధిగమించవచ్చు.
లాక్టోస్-ఫ్రీ ఉత్పత్తులను ప్రయత్నించండి: ప్రస్తుతం మార్కెట్‌లో లాక్టోస్ లేని పాలు, పెరుగు (యోగుర్ట్) సులభంగా లభిస్తున్నాయి. ఇవి సాధారణ పాల రుచిని పోలి ఉంటాయి కానీ అసౌకర్యాన్ని కలిగించవు. అలాగే లాక్టోస్ లేని జున్ను కూడా అందుబాటులో దొరుకుతుంది.
కొద్ది మొత్తంలో తీసుకోండి: ఒకేసారి పెద్ద మొత్తంలో పాలు తాగే బదులు, కొద్ది కొద్దిగా, ఆహారంతో కలిపి తీసుకోండి. ఉదాహరణకు, ఒక టీస్పూన్ పాలను మీ టీ,కాఫీలో కలుపుకోవడం లేదా భోజనం చేసిన తర్వాత కొద్దిగా పెరుగు తినడం. ఇలా చేస్తే జీర్ణక్రియ సులభమవుతుంది.

పెరుగు,మజ్జిగకు మారండి: పాల కంటే పెరుగు లేదా మజ్జిగను జీర్ణం చేసుకోవడం చాలా తేలిక. ఎందుకంటే, వీటిలో ఉండే బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) లాక్టోస్‌ను ఇప్పటికే కొంత వరకు విచ్ఛిన్నం చేసి ఉంటుంది. ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
లాక్టేజ్ సప్లిమెంట్లు: మీరు పాలు తాగే ముందు ‘లాక్టేజ్’ ఎంజైమ్ మాత్రలు తీసుకుంటే, అవి మీ శరీరంలో లేని ఎంజైమ్ పనిని చేసి లాక్టోస్‌ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఇది చాలా మందికి తక్షణ పరిష్కారం.
పాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మీ శరీరానికి పడని పాలు తాగడం కంటే, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. ఓట్ మిల్క్, బాదం పాలు, సోయా పాలు లేదా కొబ్బరి పాలు వంటివి కాల్షియం విటమిన్లు ఉన్నప్పటికీ, లాక్టోస్ సమస్య లేకుండా ఉంటాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదయినా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
