మన స్ట్రీట్ ఫుడ్ లవర్ల ఫేవరెట్ లిస్ట్‌లో మోమోలు తప్పకుండా ఉంటాయి. ఆ వేడి వేడి మోమోలు, పక్కనే ఘాటైన చట్నీ..ఆహా! కానీ మన నాలుకకు రుచినిచ్చే ఈ చిన్న డమ్లింగ్లు గుండె ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా వాటి తయారీలో వాడే పదార్థాలు మరియు వండే విధానం కొన్నిసార్లు రిస్క్ పెంచుతాయి. అతిగా అజాగ్రత్తగా మోమోలు తింటే, అది మీ గుండెకు భారంగా మారే అవకాశం ఉంది. మరి ఇష్టమైన మోమోలను ఎంజాయ్ చేస్తూనే గుండెను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
మైదా పిండి అధిక వినియోగం: మోమోస్ తయారీకి సాధారణంగా మైదా పిండిని వాడతారు. ఇది శుద్ధి చేయబడిన పిండి కాబట్టి ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. మైదా అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక కొవ్వు మరియు నూనె: ముఖ్యంగా ఫ్రైడ్ మోమోలు అత్యంత ప్రమాదకరం. వీటిని డీప్-ఫ్రై చేయడం వల్ల అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి వెళ్తాయి. ఇది ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతుంది. ఆవిరి మీద ఉడికించిన మోమోలు ఎప్పుడూ మంచి ఎంపిక.

సోడియం (ఉప్పు) మరియు ఘాటు చట్నీ: మోమోస్ చట్నీలో రుచి కోసం లేదా నిల్వ కోసం అధిక ఉప్పు (సోడియం) వాడుతారు. అధిక సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది ఇది గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఘాటైన చట్నీలో వాడే అధిక కారం మరియు నూనె కూడా జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.
జాగ్రత్త: మైదాకు బదులుగా గోధుమ పిండి (Whole Wheat) తో చేసిన మోమోలను లేదా కూరగాయలు ఎక్కువగా ఉండే మోమోలను ఎంచుకోండి.
మోమోలను తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని పరిమితంగా తీసుకోవడం, మరియు ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వారంలో ఒకసారి స్టీమ్డ్ మోమోస్ తినడం తప్పు కాదు కానీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం గుండెకు హానికరం. అందుకే రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మోమోలను గోధుమ పిండితో చేసుకుని, ఎక్కువ కూరగాయలు ఉపయోగించి, ఇంట్లో తయారుచేసుకుంటే, ఆరోగ్యకరమైన చిరుతిండిగా వాటిని ఆస్వాదించవచ్చు.
గమనిక: మీకు ఇప్పటికే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నట్లయితే, మైదా, కొవ్వు మరియు సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినే ముందు మీ డాక్టరును లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.
