ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో లాక్డౌన్ అమలవుతోంది. దీంతో గత నెల 21 నుంచి అన్ని పనులు ఆగిపోయాయి. అన్ని కార్యాలయాలు మూతబడ్డాయి. ఎక్కడ చూసినా.. పనులులేవు. ఎక్కడ విన్నా లాక్డౌన్ నినాదాలు తప్ప. దీంతో చేతివృత్తుల వారు, టెక్స్టైల్స్, బంగారం.. ఇలా అనేక రంగాలు మూగబోయాయి. ఫలితంగా కొన్ని లక్షల మంది ప్రజలు, కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో ఆర్ధిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ అయింది. ఈ ప్రభావం ఇప్పుడున్న పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే, ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి ఈనెల 14తో లాక్డౌన్ ఎత్తేయాలని భావించారు.
అయితే, కరోనా ఎఫెక్ట్ పెరుగుతుండడం, కేసుల సంఖ్య తగ్గకపోవడంతో లాక్డౌన్ ఈ నెల ఆఖరు వరకు కొనసాగనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో దేశంలో పనులు, పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజులు సమయం పడుతుందని అంటున్నారు. అప్పటికి కూడా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించే ఉంటుంది కాబట్టి ఏ పరిశ్రమలోనూ ఉత్తేజ పూరితమైన కార్యక్రమాలు జరిగే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫలితంగా ఏపీ వంటి రాష్ట్రాలు కోలుకునేందుకు కనీసంలో కనీసం ఐదేళ్లు పడుతుందని చెబుతున్నారు.
ఇప్పటికే అనేక కంపెనీలు మూతదిశగా ఉన్నాయని, లాక్డౌన్ తర్వాత వందల సంఖ్యలో చిన్నతరహా కంపెనీలు మూసేసే ప్రమాదం ఉందని నిరుద్యోగుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పుంజుకునేందుకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు. నిజానికి ఏపీ ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులు నిర్ణయించుకుని, నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అనేక సామాజిక కార్యక్రమాలకు, పథకాలకు కూడా రూపకల్పన చేసుకుంది. మరీ ముఖ్యంగా నవరత్నాల్లో ఇంకా అమలు కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆయా కార్యక్రమాలను పథకాలను అమలు చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పూర్తికి కూడా నిధుల అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇవన్నీ ముందుకు సాగే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి మున్ముందు తగ్గే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో ఏపీలో తిరిగి ఇప్పుడున్న(లాక్‌డౌన్‌కు ముందున్న) పరిస్థితి రావాలంటే.. కనీసంలో కనీసం ఐదేళ్ల సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎలా తట్టుకుని ముందుకు వెళ్తారో చూడాలి.