ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇకపై వినియోగదారులకు కిరాణా సరుకులను డెలివరీ చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మొత్తం 80 నగరాల్లో కిరాణా సరుకులను డెలివరీ చేయనున్నామని జొమాటో తెలిపింది. అయితే పలు ప్రాంతాల్లో గతంలోనే ఈ సర్వీసును జొమాటో ప్రారంభించినా.. కరోనా లాక్డౌన్తో ఫుడ్ డెలివరీలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇక కిరాణా సరుకులను డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ తెలియజేసింది.
కాగా వినియోగదారులకు కిరాణా సరుకులను డెలివరీ చేసేందుకు గాను జొమాటో సప్లైకో ఆపరేషన్స్ అనే సంస్థతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే మొదటగా కొచ్చి, ట్రివేండ్రం, కొట్టాయం, త్రిశూర్ లలో.. ఆ తరువాత ఢిల్లీ, పంజాబ్లలో.. అనంతరం ఇతర నగరాలు, పట్టణాల్లో జొమాటో గ్రాసరీ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీలు పూర్తిగా ఆగిపోయాయని, మరోవైపు హోటల్స్, రెస్టారెంట్లను మూసివేశారని.. కనుక తమ గోల్డ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు ఆ సభ్యత్వాన్ని మరో 2 నెలల పాటు ఉచితంగా అందించనున్నామని జొమాటో తెలిపింది. అందులో భాగంగానే ఇండియాతోపాటు దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, లెబనాన్, టర్కీ, న్యూజిలాండ్, పోర్చుగల్, ఖతార్లలో ఉన్న తమ గోల్డ్ మెంబర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని.. జొమాటో తెలిపింది.
కాగా ఫీడ్ ది డెయిలీ వేజర్ కార్యక్రమంలో భాగంగా తాము రూ.25 కోట్లను సమీకరించామని, దాంతో దినసరి కూలీలు, కార్మికుల కుటుంబాలకు ఇప్పటికే 1 లక్ష వరకు రేషన్ కిట్లను అందజేశామని.. జొమాటో తెలిపింది. అలాగే మరో 10 లక్షల రేషన్ కిట్లను త్వరలో అందజేస్తామని ఆ సంస్థ తెలిపింది.