కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని అనేక రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్నో కోట్ల మంది రానున్న రోజుల్లో ఉపాధిని కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని పేదలను ఆదుకునేందుకు గాను రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అందులో భాగంగానే రాబోయే 3 నెలల్లో పేదల బ్యాంకు అకౌంట్లకు నేరుగా నగదు ట్రాన్స్ఫర్ చేయడంతోపాటు.. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.
అయితే కరోనా వల్ల దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా తీవ్రమైన నష్టాల బారిన పడిన నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు కేంద్రం మరో బారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ట్యాక్స్ పేయర్లకు పెండింగ్లో ఉన్న ట్యాక్స్ రీఫండ్స్ను చెల్లిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారులకు కూడా పెండింగ్లో ఉన్న ట్యాక్స్ రీఫండ్స్ను కేంద్రం వెంటనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.
ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1 లక్ష కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని కేంద్రం రానున్న రోజుల్లో ప్రకటించవచ్చని సమాచారం. అందులో భాగంగా ఆయా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి ఇచ్చే లోన్ల పరిమితి పెంపు, ట్యాక్స్ చెల్లింపులకు కాలపరిమితి పెంపు, ఇతర మినహాయింపులపై ఆంక్షల సడలింపు.. వంటి అంశాలతో ఆయా పరిశ్రమలు గాడిలో పడతాయని, దీంతో ఆయా రంగాలపై పడే ఆర్థిక భారాన్ని కొంత వరకు తగ్గించవచ్చని కేంద్రం ఆలోచిస్తోంది. ఇక ఈ విషయంపై త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది..!