చలికాలం వచ్చిందంటే చాలు అందరికి వేడివేడి టీ, స్పైసీ స్నాక్స్, మరియు ఇంట్లో చేసిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తినాలనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల, కొన్ని ఆహారాలు మన శరీరానికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయని మనం నమ్ముతాం. అయితే కొన్ని ఆహార పదార్థాలు బయటికి వెచ్చగా అనిపించినా, అవి లోపల మీ ఆరోగ్యానికి హాని చేస్తాయని ముఖ్యంగా చలికాలంలో ఇబ్బందులను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దగ్గు, జలుబు, అజీర్తి వంటి సమస్యలను పెంచే ఆ పదార్థాలు ఏమిటి? చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దేనికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
చలికాలంలో మనం తరచుగా ఇష్టపడే కొన్ని ఆహారాలు మన ఇమ్యూనిటీని, జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. వాటిలో మొదటిది పాల ఉత్పత్తులు వాటిలో పాలు, పెరుగు, పన్నీర్ వంటివి చల్లటి పదార్థాలు కావడం వల్ల ఇవి శరీరంలో కఫం ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
అందుకే, చలి ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని మితంగా తీసుకోవడం లేదా గోరువెచ్చని పాలను తాగడం మంచిది. రెండవది, శీతల పానీయాలు మరియు రిఫ్రిజిరేటెడ్ ఆహారాలు. సహజంగానే చల్లగా ఉండే ఇవి జీర్ణక్రియ శక్తిని తగ్గిస్తాయి, ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. చలికాలంలో శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, చల్లటి ఆహారాలు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాయి.

చలికి తట్టుకోవడానికి శరీరం కొవ్వు, కేలరీలను డిమాండ్ చేస్తుంది. ఈ సమయంలో చాలా మంది బజ్జీలు, పకోడీలు వంటి నూనెలో వేయించిన స్నాక్స్ ఎక్కువగా తింటారు. ఇవి అధిక మొత్తంలో సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చలికాలంలో జీర్ణక్రియ కొంచెం నెమ్మదిస్తుంది కాబట్టి ఈ ఆహారాలు అజీర్తిని, బద్ధకాన్ని పెంచుతాయి.
అలాగే చక్కెర అధికంగా ఉండే స్వీట్లు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా సమస్యనే. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) తాత్కాలికంగా తగ్గుతుంది. చలికాలంలో వైరస్లు, బ్యాక్టీరియాలు చురుకుగా ఉంటాయి కాబట్టి, ఇమ్యూనిటీ తగ్గితే జబ్బులు త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సీజన్లో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. అలాగే పైన ఇచ్చిన వాటికి బదులుగా, గోరువెచ్చని సూప్‌లు, తాజా అల్లం, పసుపు వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోండి. ఈ చిన్నపాటి మార్పు మీ చలికాలం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంటున్నారు నిపుణులు.
గమనిక: మీ శరీరానికి ఏ ఆహారాలు అనుకూలంగా ఉంటాయో, ఏవి ఉండవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శ్వాసకోశ సమస్యలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు తమ ఆహార నియమావళిని మార్చుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
