అందమైన చిరునవ్వుకు అది ఆడ,మగ ఎవరైనా గులాబీ రంగులో ఉండే పెదాలు మరింత నిండుదనాన్ని ఇస్తాయి. అయితే చాలామంది తమ పెదాలు క్రమంగా రంగు మారుతున్నాయని (Dark Lips) ఆందోళన చెందుతుంటారు. పెదాలు నల్లబడటం అంటే వెంటనే అందరూ ధూమపానం వల్లనే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు శరీరంలోని అంతర్గత మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు. ఆ అసలు కారణాలేంటో వాటిని ఎలా నివారించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
పెదాల రంగు మారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి శరీరంలో తగినంత తేమ లేకపోవడం (Dehydration). మనం తక్కువ నీరు తాగినప్పుడు పెదాలు పొడిబారి, పగుళ్లు ఏర్పడి నల్లగా మారుతుంటాయి. అలాగే ఎండలో తిరిగేటప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్ రాసినట్లుగా పెదాలకు రక్షణ కల్పించకపోతే, సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల ‘మెలనిన్’ ఉత్పత్తి పెరిగి పెదాలు రంగు మారుతాయి.
చాలామందికి పెదాలను తరచూ నాలుకతో తడపడం అలవాటు ఉంటుంది. లాలాజలంలోని ఎంజైమ్స్ పెదాలపై ఉన్న సున్నితమైన చర్మాన్ని దెబ్బతీసి మరింత నల్లగా మారుస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.
మరో ముఖ్యమైన కారణం నాణ్యత లేని సౌందర్య ఉత్పత్తులు (Lipsticks) ఉపయోగించడం. కాలం చెల్లిన లేదా రసాయనాలు ఎక్కువగా ఉండే లిప్‌స్టిక్స్ వాడటం వల్ల అలర్జీలు ఏర్పడి పెదాలు నల్లబడతాయి. వీటితో పాటు శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నా, కెఫీన్ (టీ, కాఫీ) ఎక్కువగా తీసుకున్నా ఈ సమస్య ఎదురవుతుంది.
కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా పెదాలపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి పడుకునే ముందు పెదాలకు ఉన్న మేకప్‌ను శుభ్రం చేయకపోవడం వల్ల రసాయనాలు చర్మంలోకి వెళ్లి రంగును మార్చేస్తాయి. అందుకే ఇది కేవలం బాహ్య సమస్య మాత్రమే కాదు, మన జీవనశైలికి సంబంధించిన సంకేతం కూడా.

పెదాల రంగు మార్పు అనేది మన ఆరోగ్యం పట్ల మనం తీసుకునే శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. సరైన మోతాదులో నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం మరియు పెదాల కోసం నాణ్యమైన బామ్స్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
ఇంట్లోనే లభించే తేనె, నిమ్మరసం లేదా పెరుగు వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో పెదాలను మసాజ్ చేయడం వల్ల మళ్లీ సహజ సిద్ధమైన రంగును పొందవచ్చు. మన ముఖంలో ఎంతో కీలకమైన పెదాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నపాటి జాగ్రత్తలతో వాటి అందాన్ని కాపాడుకుందాం.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ పెదాల రంగు అకస్మాత్తుగా మారినా లేదా నొప్పితో కూడిన మచ్చలు ఏర్పడినా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించడం మంచిది.
