బంగారం అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, భారతీయులకు అదొక సెంటిమెంట్ మరియు ఆర్థిక భరోసా. ఎంతో కష్టపడితే గాని మధ్యతరగతి వాడు బంగారం కొనలేని పరిస్థితిమరి అలాంటి బంగారం కొనే వవిషయం లో మోసపోకుండా ఉండటం మన బాధ్యత. అందుకే ప్రభుత్వం ‘హాల్‌మార్కింగ్’ నిబంధనను తప్పనిసరి చేసింది. మీరు కొనే నగ అసలైనదా కాదా? అందులో నాణ్యత ఎంత ఉంది? అనే విషయాలను హాల్‌మార్కింగ్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మీ డబ్బుకు పూర్తి విలువ దక్కాలంటే ఈ ముద్రల గురించి కొంత అవగాహన ఉండటం ఎంతో అవసరం.
బంగారం లేదా వెండి కొనుగోలు చేసేటప్పుడు మనం చూసే మెరుపు కంటే దాని నాణ్యత ముఖ్యం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా ధృవీకరించబడిన హాల్‌మార్కింగ్ చిహ్నం ఉంటేనే అది మేలిమి బంగారమని అర్థం. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి నగపై ఒక విశిష్టమైన ఆరు అంకెల ‘హెచ్‌యూఐడీ’ (HUID) నంబర్ ఉంటుంది.
ఇది ఆ నగ కు ఆధార్ కార్డు లాంటిది, దీని ద్వారా ఆ నగ ఎక్కడ తయారైంది, దాని స్వచ్ఛత ఎంత అనే వివరాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. హాల్‌మార్క్ ఉన్న నగలను విక్రయించేటప్పుడు లేదా మార్పిడి చేసేటప్పుడు మనకు మార్కెట్ ధర ప్రకారం సరైన విలువ లభిస్తుంది, తరుగు పేరుతో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

వెండి వస్తువుల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. వెండి సామాగ్రి లేదా నగలు కొనేటప్పుడు వాటిపై BIS లోగోతో పాటు స్వచ్ఛత (ఉదాహరణకు 925 స్టెర్లింగ్ సిల్వర్) ముద్ర ఉందో లేదో సరిచూసుకోవాలి. చాలామంది హాల్‌మార్క్ లేని నగలు తక్కువ ధరకు వస్తాయని కొనుగోలు చేసి భవిష్యత్తులో వాటిని అమ్మేటప్పుడు భారీగా నష్టపోతుంటారు.
వ్యాపారస్తులు ఇచ్చే గ్యారెంటీ కార్డుల కంటే, ప్రభుత్వం అధికారికంగా వేసే ఈ ముద్రలే వినియోగదారులకు అసలైన రక్షణ కవచాలు. కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ ఛార్జీలతో కూడిన పక్కా బిల్లును అడగడం వినియోగదారుల ప్రాథమిక హక్కు.
చివరగా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం మీ ఇంటికి సిరిసంపదలను తీసుకురావాలి కానీ అది మీకు భారంగా మారకూడదు. కొనుగోలు సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండి, హాల్‌మార్క్ ముద్రలను తనిఖీ చేసుకుంటే మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.
