భీష్మ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది మనస్సును భగవంతునిపై లగ్నం చేసే ఒక పవిత్రమైన రోజు. చాలామంది భక్తితో ఉపవాసం ఉండాలని అనుకుంటారు, కానీ ఆరోగ్య సమస్యల వల్ల లేదా వయస్సు రీత్యా అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి ఉపవాసం చేయలేనప్పుడు అధైర్యపడాలా? అక్కర్లేదు.. శరీరానికి ఇబ్బంది కలగకుండా, సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా ఈ ఏకాదశి విశిష్టతను ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం.
ఉపవాసం అనేది క్రమశిక్షణ కోసమే తప్ప శరీరాన్ని హింసించుకోవడానికి కాదు. మీరు పూర్తిగా ఏమీ తినకుండా ఉండలేకపోతే, సాత్విక మార్గాన్ని ఎంచుకోవచ్చు. బియ్యం, పప్పు ధాన్యాలకు బదులుగా పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం.
ఒకవేళ ఘన పదార్థం కావాలనుకుంటే సాబుదానా (సగ్గుబియ్యం) కిచిడీ లేదా ఉడికించిన దుంపలను తక్కువ ఉప్పు, కారంతో తీసుకోవచ్చు. ముఖ్యం ఏమిటంటే, ఉల్లి, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉంటూ, తేలికపాటి ఆహారంతో జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిస్తూ దైవచింతనలో గడపడం.
భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాలను లోకానికి అందించిన రోజు ఇది. కాబట్టి, ఆహారం కంటే ఈరోజు నామస్మరణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం మీ సాత్విక గుణాన్ని పెంచేలా ఉండాలి.

నీరు ఎక్కువగా తాగుతూ, పండ్ల రసాలు తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. “లంకణం పరమౌషధం” అన్నట్టుగా, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూనే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనస్సుకి ప్రశాంతత, పుణ్యం రెండూ లభిస్తాయి.
భీష్మ ఏకాదశి 2026, ముహూర్తం మరియు విశిష్టత: భీష్మ ఏకాదశి ఎప్పుడు? ఉపవాసం ఏ రోజు ఉండాలి? అనే సందేహం చాలామందికి ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏకాదశి తిథి జనవరి 28వ తేదీ (బుధవారం) సాయంత్రం 4:40 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి జనవరి 29వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 1:55 గంటల వరకు ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం సూర్యోదయంతో వున్నా టిడినే మనం లెక్కలోకి తీసుకుంటాం. కావున జనవరి 29, గురువారం రోజున భీష్మ ఏకాదశిని జరుపుకోవాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మధుమేహం (Diabetes) ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా లేకుండా కఠిన ఉపవాసాలు చేయకూడదు.
