పూర్వ కాలంలో ఆడవాళ్ళు వంటిల్లు దాటి బయటకు వచ్చేవారు కాదు. మరియు బాల్య వివాహాలు, కన్యా శుల్కం వంటి వాటితో ఆ రోజుల్లో ఆడ వాళ్ళను చిన్న చూపు చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో బాల్య వివాహం చేసుకుని భర్త సహకారం తో చదువుకుని దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. ఉపాధ్యాయురాలుగా మాత్రమే కాక గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప విప్లవ కారిణి.
సావిత్రి భాయ్ ఫూలే 1831 జనవరి 3 న మహారాష్ట్ర లో ఉన్న నయా గావ్ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించింది. ఆమెకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 12 సంవత్సరాల మహాత్మ జ్యోతిరావ్ ఫూలే తో వివాహమైంది. భర్త సహకారంతో చదువుకుని 1848 మే 12 న పూణే లో తొలిసారిగా పాఠశాలను ప్రారంభించారు. ఛాందసవాదులు ఆమెపై దాడి చేసినా ఆమె భయపడలేదు.
ఆమె గురజాడ చెప్పినట్టు చరిత్రను తిరగరాసింది. బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ రోజుల్లో సంఘ సంస్కరణలకు బాటలు వేసింది. ఒక పక్క సమాజ సేవ చేస్తూ, ఉపాధ్యాయురాలిగా కొనసాగుతూ తన కలానికి పని చెప్పి గొప్ప రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక అంటరానితనం, సతి సహగమనం, బాల్య వివాహాలు వంటి అనేక అంశాలపై ఉద్యమాలు చేసి విజయం సాధించారు.
1897 లో ప్లేగు వ్యాధి తో ఆమె కన్ను మూశారు. మహిళా మార్గదర్శి, మహోన్నత రచయిత్రి సావిత్రి భాయ్ కలలు కన్నా సమాజం ఆదర్శవంత సమాజం. ఏ మహిళ సమస్యలు ఎదుర్కోకూడదని, సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోకూడదని నిరంతరం కృషి చేసారు. ఇంకా ఆమె ఆశయాలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడానికి ప్రతి మహిళా కృషి చేయాలి.