కరోనా లాక్‌డౌన్ పుణ్యమా.. అని దేశంలో అసలు గతంలో ఎన్నడూ లేని అరుదైన దృశ్యాలు, సంఘటనలు మన కళ్లకు కనబడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా గుంపులు గుంపులుగా కిక్కిరిసి పోయి కనిపించే జనాలు ఇప్పుడు భౌతిక దూరం బాట పట్టారు. మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరున్నర దూరం పాటిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుడా సహకరిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తాజాగా మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యే సరికి దేశంలో అనేక చోట్ల మందు బాబులు శృతి తప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు. మళ్లీ యథావిధిగా గుంపులు గుంపులుగా మద్యం కోసం దుకాణాల వద్ద ఎగబడ్డారు. కానీ తెలంగాణలో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపించింది.
మద్యం అమ్మకాలు తెలంగాణలో ప్రారంభమైన తొలి రోజే వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియులు పెద్ద ఎత్తున గుమిగూడతారు కాబోలునని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా వారు పూర్తిగా క్రమశిక్షణ పాటించారు. భౌతిక దూరాన్ని పాటించారు. ముఖాలకు మాస్కులను ధరించారు. షాపుల వద్ద వ్యాపారులు మద్యం ప్రియుల చేతులను శానిటైజర్ తో శుభ్రం చేశాకే వారి నుంచి డబ్బులు తీసుకుని మద్యం ఇవ్వడం కనిపించింది. నిజంగా మద్యం ప్రియులు ఎంత బుద్ధిగా వ్యవహరిస్తున్నారో కదా.. అనిపించింది. అయితే ఇలా వారు ప్రవర్తించడానికి సగం కారణం కేసీఆరేనని చెప్పవచ్చు.
మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అర్ధరాత్రి దాకా జర్నలిస్టులతో మాట్లాడారు. మద్యం షాపులను బుధవారం నుంచే తెరుస్తామని ప్రకటించారు. అలాగే భౌతిక దూరం పాటించకపోతే.. మద్యం షాపులను మూసివేస్తామని కూడా హెచ్చరించారు. సరిగ్గా ఇదే మంత్రం పనిచేసింది. దీంతో స్వయంగా మద్యం విక్రేతలే రంగంలోకి దిగి షాపుల వద్ద మనుషులను పెట్టి మరీ భౌతిక దూరం పాటించేలా.. మాస్కులను ధరించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో దాదాపుగా ఎక్కడా మద్యం కోసం మందుబాబు పెద్ద ఎత్తున గుమిగూడిన దాఖలాలు కనిపించలేదు. ఇక కొన్ని చోట్ల ఎండలో నిలబడలేక లైన్లలో చెప్పులు, రాళ్లు, సంచులను మద్యం ప్రియులు ఉంచారు. అది కూడా క్రమశిక్షణతోనే చేశారు. ఏది ఏమైనా.. చక్కని డిసిప్లిన్ పాటించడం అందరికీ అవసరమే. అది మద్యం షాపులే కాదు, అన్ని చోట్లా అనుసరించాలి. అప్పుడే కరోనా మహమ్మారి వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు..!