ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. కరోనా లాక్డౌన్ వల్ల అందరూ వేసవి గురించి మరిచిపోయారు కానీ.. నిజానికి ఈ సారి ఎండలు మనల్ని కాస్త ఎక్కువగానే భయపెడుతున్నాయి. అనేక చోట్ల ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని అటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా హెచ్చరిస్తోంది. ఇందులో భాగంగానే ప్రజలు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇండ్లను చల్లగా ఉంచుకునే ప్రయత్నాలు చేయాలని.. సూచించింది. మరి ఈ మండే వేసవిలో ఇండ్లను చల్లగా ఉంచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
* టెర్రెస్, బాల్కనీలు, కిటికీలు, తలుపులు, గోడలపై మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి వచ్చే వేడి గాలి తగ్గుతుంది. దీంతో ఇల్లు త్వరగా వేడెక్కకుండా ఉంటుంది. అలాగే చల్లదనం బయటకు పోకుండా ఉంటుంది. ఇక వేడిని గ్రహించే పలు రకాల మొక్కలు కూడా మనకు లభిస్తాయి. వాటిని పెంచుకుంటే ఎండ వేడిని తరిమికొట్టవచ్చు.
* ప్రస్తుత తరుణంలో మార్కెట్లో మనకు ఇంట్లో కూలింగ్ ఇచ్చే తెల్లని సున్నం లభిస్తోంది. దీన్ని ఇంటిపైకప్పు మీద కోట్లా వేస్తే.. కనీసం 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపణ కూడా అయింది. కనుక ఈ సున్నంతో ఇంట్లో చల్లదనాన్ని పెంచుకోవచ్చు.
* వేసవి కాలంలో సహజంగానే చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటికీలు, తలుపులను తెరిచి ఉంచుతారు. కానీ అలా చేయరాదు. బయటి నుంచి వేడి గాలి బాగా వచ్చి ఇంట్లో టెంపరేచర్ పెరుగుతుంది. కనుక ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కిటికీలు, తలుపులను మూసి ఉంచాలి. ఇక ఆ సమయం దాటాక చల్లగాలి వస్తుంటుంది కనుక, వాటిని తెరిస్తే.. ఇంట్లోకి చల్లని గాలి వస్తుంది. దీంతో ఇల్లు చల్లబడుతుంది.
* పగటిపూట వీలైనంత వరకు మరకు లైట్ల అవసరం ఉండదు కనుక వాటిని ఆఫ్ చేయాలి. కొందరు అవసరం లేకున్నా పగటి పూట కూడా లైట్లు వేస్తారు. అది మానుకోవాలి. ఎందుకంటే.. లైట్ల ద్వారా ఉష్ణం వెలువడి ఇంట్లో వాతావరణం వేడెక్కుతుంది. కనుక పగటిపూట లైట్లను ఆఫ్ చేయాలి.
* ఇంటి పైకప్పుపై నీళ్లు చల్లడం ద్వారా కూడా ఇల్లు చల్లగా మారుతుంది. సాయంత్రం వేళల్లో ఇలా చేస్తే.. రాత్రయ్యే సరికి చల్లగా మారుతుంది. దీంతో రాత్రిపూట చక్కగా నిద్రించవచ్చు.
* ఇంటి పైకప్పు మీద ఎండు గడ్డి వేయడం లేదా టార్పాలిన్లు కప్పడం చేస్తే కొంత వరకు ఉష్ణోగ్రత కిందకు రాకుండా నియంత్రించవచ్చు.
* ఇంటి లోపల ఫాల్ సీలింగ్ చేయించుకుంటే.. ఉష్ణోగ్రతను కొద్దిగా తగ్గించవచ్చు.
* ఇంటి చుట్టూ తీగజాతికి చెందిన మొక్కలను పెంచితే అవి గోడలకు అల్లుకుంటాయి. దీని వల్ల ఇంట్లోకి వేడి రాకుండా చల్లగా ఉంటుంది.
* ఇంటి పైకప్పు మీద, ఇంటి గోడలకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకుంటే.. లోపలి నుంచి వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది.