జర్నలిస్టులు అనే వారు సహజంగానే పత్రికల్లో వార్తలు, కథనాలు రాస్తుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా అయితే స్క్రిప్ట్ రాస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. కానీ డిజిటల్ మీడియా రాకతో ఈ పదానికి పూర్తిగా అర్థమే మారిపోయింది. కంటెంట్ రైటర్లుగా జర్నలిస్టులు మారారు. అయితే ఆసక్తి, నైపుణ్యం, భాషపై పట్టు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండడం, సాంకేతిక పరికరాలు వాడగలిగే సత్తా ఉండడం.. వంటి అర్హతలు ఉంటే.. నేటి తరుణంలో ఎవరైనా కంటెంట్ రాయవచ్చు. అది పెద్ద కష్టమేమీ కాదు.
కంటెంట్ రైటర్ అంటే.. రెండు రకాలు.. వార్తలు రాసేవారు. అంటే టీవీలు, ఇతర సాధనాల్లో వచ్చే వార్తలను పాఠకులు చదివే విధంగా లేదా ఇతర భాషల్లో ఉంటే అనువదించి రాయడం. రెండో రకం కంటెంట్ రైటర్లు.. కథనాలు రాస్తారు. ప్రస్తుతం అనేక వెబ్‌సైట్లలో ఈ తరహా కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. వీరికే డబ్బులు ఎక్కువ సంపాదించుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే కంటెంట్.. అంటే ఏదైనా ఒక కథనం రాయాలంటే.. అందుకు అభ్యర్థికి ఆసక్తి ఉండాలి. తనకు పట్టు ఉన్న, నచ్చిన అంశంపై కథనాలు రాయవచ్చు. కాకపోతే అందులో ముఖ్యమైన అంశాలు కవర్ అయ్యేలా చూసుకోవాలి.
ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా.. అనే అంశాలను కవర్ చేసేలా వార్తలైనా, కథనాలు అయినా రాయాల్సి ఉంటుంది. ఇక ఆసక్తికరమైన కథనాలు రాసేటప్పుడు అందుకు సంబంధించిన సంక్షిప్త విషయాన్ని మొదటి పారాలో చెప్పాలి. దాన్నే లీడ్ అంటారు. లీడ్ రాశాక. కింది పేరా నుంచి అసలు కథనం రాయవచ్చు. ఒక కథనం రాసేటప్పుడు కనీసం 3 లేదా 4 పారాలు ఉండేలా చూసుకోవాలి. ఆసక్తికరమైన కథనం అయితే ఇంకా ఎక్కువ పారాగ్రాఫ్‌లు వచ్చేలా కూడా రాయవచ్చు. కాకపోతే పాఠకుడు మన కథనం చదువుతూ బోర్ ఫీలవ్వకూడదు. అందుకని సమాచారం ఉన్నంత మేరకు ఎంత వీలైతే అంత మంచి ఆర్టికల్‌ను రాసేందుకు యత్నించాలి. ఇలా ఆర్టికల్స్ రాయడం అలవాటు అయితే కొద్ది రోజుల్లోనే కంటెంట్ రైటర్‌గా గుర్తింపు పొందవచ్చు. ఆ మేరకు ఆదాయం కూడా లభిస్తుంది.
ఇక కంటెంట్ రైటర్‌గా మారాలనుకునేవారు గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం.. టైపింగ్.. తెలుగులో ఎంత వేగంగా టైప్ చేయగలిగితే నిత్యం అన్ని ఎక్కువ ఆర్టికల్స్ రాసేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతో ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక ఆ దిశగా కూడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. అలాగే భాషపై కూడా పట్టు ఉండాలి. దీంతో కంటెంట్ రైటర్లుగా రాణించడం పెద్ద కష్టమేమీ కాదు.