సరిగ్గా పది నెలల కిందట ఓ వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే వార్త వినిపించింది. ఏ మీడియా ఛానల్ పెట్టినా.. ఏ న్యూస్ పేపర్ చూసినా ఇదే విషయం కనపడింది. బాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కొందరు ఆత్మహత్య అంటే మరి కొందరు హత్య అని ఆరోపించారు. కాగా ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో అనుమానాలు తీవ్రస్థాయికి చేరాయి.
ఇదే టైమ్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. స్టాండ్ ఫర్ జస్టిస్ టు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనే లైన్ మీద సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్ అయ్యాయి. ట్విట్టర్ లో హాశ్‌ట్యాగ్ లు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వారియర్స్ నిర్విరామంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ గ్రూపుల్లో తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
ఇక ఈ ఉద్యమం మొదలై నేటికి పది నెలలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ లో ఎస్ఎస్ఆర్ హాస్టేజ్ ఎట్ మాంట్ బ్లాంక్ అనే ట్యాగ్ లైన్ ఈ రోజు ఉదయం నుంచి విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో తాము రివేంజ్ కోరుకోవట్లేదని, కేవలం న్యాయం మాత్రమే కోరుకుంటున్నాని ట్వీట్లు, రీ ట్వీట్లు మోత మోగుతున్నాయి. రియా చక్రవర్తికి ఈ కేసులో బెయిల్ ఇవ్వడం సుశాంత్ అభిమానులకు మింగుడపడటం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. ఇక ఇన్ని రోజులైనా సుశాంత్ కేసులో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు సేకరించడం లేదని సీబీఐను విమర్శిస్తున్నారు.