కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీసులు ఆ హోటల్ పై రైడ్ చేశారు. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అక్కడిన నుంచి పారిపోయినట్లు సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి సెకండ్ ఫ్లోర్ లోకి దూకి మెట్ల మార్గంలో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు మాలీవుడ్ మీడియా కథనాలు వస్తున్నాయి.
మరోవైపు సినిమా సెట్‌లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ షైన్ టామ్ చాకోపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఆమె ఫిర్యాదు చేయడంతో త్వరలోనే దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక విన్సీ, షైన్ కలిసి ‘సూత్రవాక్యం’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విన్సీ వ్యాఖ్యలు మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.