వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ఇవాళ (గురువారం) విచారణ ముగిసింది. పూర్తిస్థాయి వివరణ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థాన్ని కేంద్ర సర్కార్ వారం రోజుల గడువు కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతకుముందు సుప్రీంకోర్టు వక్ఫ చట్టం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
వక్ఫ్ బోర్డులో ఎలాంటి మార్పులు చేయవద్దని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని.. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు బుధవారం రోజున వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తూ కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఎంతో కసరత్తు చేశాక వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.