తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు దళపతి విజయ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతడికి దూరంగా ఉండాలని తమిళనాడు ముస్లింలకు సూచిస్తూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ గత చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
మద్యం తాగే వారిని, జూదగాళ్లను విజయ్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి రంజాన్ మాసం పవిత్రతను దిగజార్చారని రజ్వీ విజయ్ పై మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అతణ్ని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలకు సూచించారు. ఇక విజయ్ నటించిన బీస్ట్ మూవీలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని.. సినిమాల్లో ముస్లింల వ్యతిరేకిగా ఉన్న విజయ్.. రాజకీయాల్లోకి రాగానే ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనకు దూరంగా ఉండాలని ముస్లిం కమ్యూనిటీకి సూచించారు.