బాలీవుడ్ నటుడు, నిర్మాత సోనూసూద్ భార్య సోనాలికి కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. సోనాలి తన మేనల్లుడుతో కలిసి నాగ్ పూర్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు మరో మహిళతో పాటు కారులో ప్రయాణిస్తుండగా.. వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలి, ఆమె మేనల్లుడితో పాటు మరో మహిళ గాయపడ్డారు. అయితే కారు డ్రైవర్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు లోకల్ మీడియా కథనాలు తెలిపాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికులు నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ వెంటనే భార్య వద్దకు పయనమయ్యాడు. అయితే తన సతీమణి కండిషన్ సురక్షితంగానే ఉందని సోనూ సూద్ తెలిపారు. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న సోనూ అభిమానులు తమ అభిమాన నటుడి సతీమణి త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.