తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉగాది పండుగలోపు మంత్రివర్గ విస్తరణ చేసి.. ఏప్రిల్ మూడో తేదీన కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా మంత్రివర్గం లోకి ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక రెడ్డికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్సీల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఒకవేల మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, రెడ్డిల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి అవకాశం లభించినట్లు తెలుస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్తో పాటు కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలు తీసుకొని వీరిని ఏఐసీసీ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు.. మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా తమకు పదవి దక్కుతుందన్న ఆశతో మరికొంతమంది ముఖ్య నేతలు ఇంకా పావులు కదుపుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బలూ నాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.