ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా ‘కేసరి’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హల్వీదర్ ఇషార్ సింగ్ అనే పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా 1897వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియన్ సైనికులకు, ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు మధ్య జరిగిన సరాగర్హి అనే యుద్ధం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనురాగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో అక్షయ్ సిక్కు యోధుడిగా అలరించనున్నాడు.
అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘కేసరి’ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటిస్తోంది. కాగా ఇటీవలే ఈ సినిమాకు చెందిన టీజర్‌ను విడుదల చేయగా అందుకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అందులో అక్షయ్ నటించిన పలు సీన్లకు అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి.
‘కేసరి’ సినిమా ట్రైలర్ లో అక్షయ్ చెప్పిన ఓ డైలాగ్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 21 మంది సిక్కులు, 10వేల మంది ఆక్రమణదారులకు మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన కథనే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇక ఈ సినిమా మార్చి 21వ తేదీన విడుదల కానుంది.