‘జవాన్’​కు పుష్ప ప్రశంసలు.. బన్నీని ఆకాశానికెత్తేసిన షారుక్

చిన్న సినిమా అయినా.. పెద్ద చిత్రమైనా.. కంటెంట్ నచ్చితే తప్పకుండా ఆ మూవీ టీమ్​ను అభినందిస్తాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా బన్నీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రాన్ని చూసాడు. ఆ సినిమా బన్నీకి తెగ నచ్చేసిందట. ఇక అందులో షారుక్ నటనకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడట. ఇదే విషయాన్ని షారుక్ కు చెప్పాడు. దానికి షారుక్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

‘జవాన్‌’ సినిమా ఓ వైపు వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. షారుక్ మొదటిసారిగా ఊర మాస్ అవతారంలో కనిపించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్‌ ‘జవాన్‌’  చిత్రబృందాన్ని ఎక్స్‌ వేదికగా ప్రశంసించాడు.

దీనిపై షారుక్‌ ప్రతిస్పందిస్తూ ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ నటనని ప్రశంసించాడు. ‘పుష్ప’ సినిమాని మూడు రోజుల్లో మూడు సార్లు చూశాననీ, మీ నుంచి ఏదో నేర్చుకున్నానని చెప్పక తప్పదంటూ షారుక్‌ అన్నాడు. ఫైర్‌ తన నటనని మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానంటూ షారుక్‌ ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.