ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే..!

-

కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడంతో.. చాలా సినిమాల విడుదల అగిపోయింది. లాక్ డౌన్ ఎత్తివేతపై స్పష్టత లేకపోవడం.. ఒకవేళ సడలింపులు ప్రకటించిన కూడా అన్నింటి కంటే చివర్లో థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో సినీ నిర్మాతలు పరిస్థతి రోజురోజుకు దారుణంగా మారుతోంది. విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాల నిర్మాతల పరిస్థితి.. మరింత అద్వానంగా తయారైంది. దీంతో కొందరు చిన్న సినిమా నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే అమృతరామమ్ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల కానుంది. తద్వారా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల కానున్న తొలి చిత్రంగా నిలవనుంది.రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా సురేందర్‌ కొంటాడ్డి దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అమృతరామమ్’. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు జీ5 యాప్‌లో ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. ఇంట్లోనే ఉండి ప్రేక్షకులు అమృతరామమ్ సినిమా స్పెషల్ ప్రీమియర్‌ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని ఉగాది రోజున విడుదల చేయాలనుకున్నాం. కరోనాతో అనివార్య పరిస్థితులు తలెత్తడంతో జనతా కర్ఫ్యూ విధించడం, ఆపై లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో.. జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు నేరుగా అందించాలని నిర్ణయించుకున్నాం. థియేటర్లలో విడుదల చేయకుండా ఇలా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటిదాకా ప్రేమకథల్లో హీరోలే త్యాగాలు చేసినట్లు సినిమాలు వచ్చాయి. ఒకవేళ హీరోయిన్ పిచ్చిగా ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచింది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలెవరూ బయటకు రావడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. థియేటర్లలో సినిమా విడుదల కావడం.. ప్రేక్షకులు రావడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రేక్షకులు అర్థం చేసుకుని సినిమాను కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది” అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో.. సినిమాపై పెట్టిన బడ్జెట్ తిరిగి పొందేందుకు ఓటీటీని ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news