బర్త్ డే స్పెషల్ : టాలీవుడ్ హీరోయిన్స్ లో అనుష్క అందుకే అంత ప్రత్యేకం…..!!

2007లో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుష్క, స్వతహాగా బెంగళూరుకు చెందిన అమ్మాయి. నవంబర్ 7, 1981లో కర్ణాటకలోని మంగళూరులో ప్రఫుల్ల మరియు విట్టల్ శెట్టి దంపతులకు జన్మించిన అనుష్క, చిన్నప్పటి నుండి చదువులో కూడా ఎంతో చురుకుగా ఉండేదట. ఆమెకు ఇద్దరు సోదరులు, ఇక అనుష్క బాల్యం అంతా కూడా బెంగళూరు లోనే గడిచింది. అలానే అక్కడి మౌంట్ కార్మెల్ కాలేజిలో బ్యాచలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని అభ్యసించిన అనుష్క, ఆ తరువాత యోగ ఇన్స్ట్రక్టర్ గా ప్రముఖ హీరోయిన్ భూమిక భర్తయిన భరత్ ఠాకూర్ దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆమె పలువురికి యోగలో కోచింగ్ కూడా ఇచ్చారు. అయితే అదే సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను చూసి, పూర్తి వివరాలు తెలుసుకుని తాను నాగార్జునతో తీయబోయే సూపర్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమెకు అవకాశం ఇవ్వడం జరిగింది.

అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, హీరోయిన్ గా అనుష్క మాత్రం మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత ఆమె సుమంత్ సరసన మహానంది సినిమాలో నటించారు, కాగా ఆ సినిమా కూడా పెద్దగా కాలేదు. ఇక ఆ తరువాత రవితేజ, రాజమౌళి ల కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనుష్క, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో, హీరోయిన్ గా తొలి విజయాన్ని అందుకున్నారు. అనంతరం ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు, అయితే కొన్నాళ్ల తరువాత గోపీచంద్ తో కలిసి ఆమె నటించిన లక్ష్యం సినిమా సూపర్ హిట్ కొట్టి, అనుష్కకు మరొక సక్సెస్ అందించింది. ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అనుష్కకు, 2009లో కోడిరామకృష్ణ తాను తీయబోయే అరుంధతి సినిమాలో ప్రధాన పాత్రను అఫర్ చేసారు. మొదట్లో అనుష్క ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందో అని ఆ సినిమా యూనిట్ మొత్తం కొంత ఆలోచనలో పడ్డారట.

అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ, తనలోని అద్భుతమైన నటనను బయటపెట్టి, ఆ సినిమాతో సోలో హీరోయిన్ గా అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు అనుష్క. ఇక అక్కడినుండి ఆమెకు తెలుగు సహా, తమిళ్ వంటి పలు ఇతర భాషల్లో కూడా అవకాశాలు బాగా వచ్చాయి. ఇకపోతే ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాల్లో ప్రధాన హీరోయిన్ పాత్రలో నటించిన అనుష్కకు, దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు లభించింది. అనంతరం మరొక్కసారి ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా భాగమతి కూడా సూపర్ హిట్ కొట్టి, ఆమె ఇమేజి మరింత పెరగడానికి దోహదం చేసింది. ఇక ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న అనుష్క, ఆ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు…….!!