సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయిన తెలంగాణ ఎమ్మెల్యే.. రీజ‌న్ అదేనా..?

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , ఆయన సతీమణి ఆర్తి రెడ్డితో కలిసి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలో కలిశారు. రజనీకాంత్‌‌ నివాసంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డికి సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో అవినాభవ సంబంధాలు ఉన్నాయి. గతంలో రోహిత్ రెడ్డి కుటుంబ ఫంక్షన్లకు కూడా రజనీకాంత్ హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి రజినీకాంత్ దగ్గరకు వెళ్లి ఆయన ఆశిర్వాదం తీసుకున్నారు. అదే స‌మ‌మంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని రజనీ సూచించినట్టు తెలిపారు. అయితే ఇది కేవ‌లం వ్యక్తిగత భేటీ మాత్రమేనని వెల్లడించారు. రోహిత్ రెడ్డి ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌రెడ్డి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.