ఆంధ్రప్రదేశ్ సర్కార్.. బయట చేసేది ఒకటి.. కోర్టుల్లో వాదించేది ఒకటి అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇతర కేసుల సంగతేమో గాని.. యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా విషయంలో మాత్రం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వ వాదన చాలా చిత్ర విచిత్రంగా ఉంది. కావాల్సినంతగా రేట్లు పెంచుకుని … ఉదయం నుంచి రాత్రి వరకూ నిరాటంకంగా షోలు వేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వమే సాహో నిర్మాతలకు కల్పించింది.
ఈ మేరకు ధరల విషయం క్లారిటీ ఇవ్వకుండా ఆరు షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన లూజుతో ఏపీలో థియేటర్ల యజమాన్యాలు అమాంతం సాహో రేట్లను పెంచేశాయి. కొన్ని చోట్ల ఏకంగా రెండితలు, మూడింతలు చేసేశాయి. ధియేటర్ల వారీగా రూ.175, ఇంకొన్ని రూ.230కి పెంచేశారు. కొన్ని మల్టిపెక్స్లలో సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200కి అమ్మేశారు.
సినిమా తొలి రోజే చూడాలన్న ఆతృతతో ఉన్న ప్రేక్షకుల బలహీనతలను ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నా ఏపీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము టిక్కెట్ల రేట్ల పెంపుపై అనుమతులు ఇవ్వలేదని.. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టలేమని చెపుతోంది.
ఓ వైపు ఆన్లైన్లో కూడా పెరిగిన టిక్కెట్ రేట్లతోనే బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఈ పెంచుకున్న టిక్కెట్ల రేట్లతో తొలి రోజే రూ.7-8 కోట్ల వరకు అదనంగా వసూలు చేసుకుంటారు. ప్రజల నుంచి అంత సొమ్ము దోపిడి చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుందో ? ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే రేట్లు పెంచుకోమ్మని తాము చెప్పలేదంటూనే.. తెర వెనక మాత్రం చూసిచూడనట్టుగా వదిలేస్తున్నారు. అంటే అంతిమంగా ప్రజల సొమ్మే పోయినా ప్రభుత్వానికి పట్టదన్నమాట.