తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీనే బిఫోర్ అండ్ ఆఫర్‌గా మాట్లాడుకునేలా చేసింది. టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాహుబలి ది బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్‌గా రెండు భాగాల్లో వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నటించిన అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ పాత్రలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా ఇప్పుడు మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కాస్త బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ దృష్టికి వచ్చింది. దాంతో శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
‘ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా బొమ్మను తయారు చేసి పెట్టారు. విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని శోభు యార్లగడ్డ మండిపడ్డారు.
This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi
— Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023