ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణాలు బలి తీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ ఏసీ వేసుకోవడంతో చలి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని శామలి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారణమైన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రోజున ఇద్దరు పిల్లలు జన్మించారు. వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించి ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు వెళ్లేసరికి వారు ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా కనిపించారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విషయం గురించి తెలుసుకుని డాక్టర్ నీతూను అరెస్టు చేశారు. అనంతరం శిశువల కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.