ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్ ఎంపిక అయ్యాయి. ప్రాకృతిక సౌందర్యం, సాంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ కలలు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించగా, తాజాగా కేంద్రపర్యాటకశాఖ ఈ సంవత్సరానికి గాను జనగామ జిల్లా పెంబర్తి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చాంద్లాపూర్ ను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది.
ఈ నెల 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డులను ప్రధానం చేయనున్నది. కాకతీయుల కాలం నుంచి ఈ గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి. ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి కళాకారులు రూపొందించే కళాకృతులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సాంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.