తెలుగు నేలపై పుట్టి
తెలుగు రాని వారికి
తెలుగు పలకడం తెలియని వారికి
అమ్మ భాష పై ప్రేమ లేని వారికి
ఇంకా ఇంకొందరికి
ఆమె నడవడి ఆదర్శం
కాన్వెంటు చదువులు ఎన్ని ఉన్నా
కొన్ని సార్లయినా మన తెలుగు అందం
తెలుసుకోండి అనేందుకు సుమ జీవితం తార్కాణం
సుమ పద ఉచ్ఛారణ ఓ ప్రామాణికం
అందమయిన వెన్నెలలు కొన్నే ఉంటాయి
రేయి కరిగి వికసించి ప్రకటించే సందర్భాలు కొన్నే ఉంటాయి
భాషను ప్రేమిస్తే వికాసం ఒక్కటే కాదు వినోద ప్రధాన మాధ్యమాల్లో
విశేషించిన ప్రతిభను నిరూపించుకునేందుకు అది ఒక కారణం కూడా !
క్రియెటివ్ ఫీల్డ్ లో స్పాంటేనిటీ అని ఒకటి ఉంటుంది..అది యాక్టింగ్ కు మరియు డైలాగ్ కు కూడా! ఎంతో ముఖ్యం. స్క్రిప్ట్ లో లేనివి అప్పటికిప్పుడు అనుకుని పలకడం అన్నది కొందరికే సాధ్యం. కోట్ల మంది జనాల మధ్య వ్యంగ్య భావాలు అప్పటికప్పుడు పుట్టించడం చాలా కష్టం. సెటైరిక్ వెర్షన్ తో ఓ యాంకర్ రాణించడం ఇంకా కష్టం.
నొప్పించక తానొవ్వక అన్న పద్ధతిలోనే మాట్లాడుతూ ఆలోచింపజేయడం అన్నది ఇంకా కష్టం. కానీ సుమ మాత్రం ఇందుకు భిన్నం. ఆమె నవ్విస్తూనే ఆలోచింప జేస్తారు. భాషపై ప్రేమ పెంచుతారు. మనది కాని సంప్రదాయం నుంచి వచ్చి..మన సంప్రదాయాల విలువేంటో చాటి చెబుతారు.ఓ విధంగా ఆమె ఇవాళ తెలుగింటి బిడ్డ. మనందరి ఆత్మీయ నేస్తం. మార్చి 22 …పుట్టిన్రోజు సందర్భంగా జేజేలు మీకు.
నా మాటే శాసనం అని సినిమా వరకే చెప్పగలిగారు రమ్యకృష్ణ (శివగామి పాత్రధారిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు)..ఆ మాటకు వస్తే సుమ మాటే పారిజాత పరిమళం..శాసనం కూడా ! శబ్ద శాసనం అని దశాబ్దాల కాలం రుజువు చేసింది. బుల్లితెర మహరాణి సుమ అని నిరూపించింది. మాటల్లోనూ నవ్వుల్లోనూ ప్రత్యేక రీతి ఆమెది అని చాటిచెప్పింది. తెలుగు వారి లోగిళ్లకు పరిచయం అయిన ఆ పేరు ఇప్పుడొక బలమైన పద బంధంగా మారిపోయింది.
భాష పలకడం వేరు.. సొంతం చేసుకుని పలకడం వేరు..స్థానిక పలుకుబడులు తెలుసుకుని మరీ! మాట్లాడడమే ఓ ప్రత్యేక గుణం. అమ్మ భాష అయితే తెలుగు కాదు..అత్తారింటికి వచ్చాక వచ్చిన,ఇంకా చెప్పాలంటే ఆమె ఖ్యాతినో,కీర్తినో విస్తారం చేసిన చేసేందుకు కారణం అయిన భాష మాత్రం మన తెలుగు అని నిర్థారణ చేయడం ఇవాళ ఇరు ప్రాంతాల వారికీ ఎంతో ఆనందదాయకం.
ఇదే సందర్భంలో త్రివిక్రమ్ ఫంక్షన్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన ఒరవడిలోనే మాట్లాడి, ఆయన ఒరవడిలోనే వ్యంగ్యం పలికి యాంకర్ గా తన కెరియర్ ను మరింత సుస్థిరం చేసుకున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు. ప్రయోక్త (యాంకర్) బాధ్యతల్లో ఆమె ఉన్నారంటే ఆడియో ఫంక్షన్ హిట్.
ప్రయోక్త (యాంకర్) బాధ్యతల్లో ఆమె ఉన్నారంటే ఈటీవీ వారి పాడుతా తీయగా హిట్ ..ప్రయోక్త (యాంకర్) బాధ్యతల్లో ఆమె ఉన్నారంటే స్వరాభిషేకం కార్యక్రమం హిట్…హిట్..హిట్..హిట్..ఆమె మాటే సక్సెస్‌కు ఓ కేరాఫ్..అందుకే ఆమె ప్రతి కార్యక్రమానికి విచ్చేసే అతిథులకు శుభ స్వాగతం..సుమ స్వాగతం అని పలుకుతారు..తనదైన ప్రత్యేకత చాటుతారు.
తెలుగింటి కోడలు సుమ అని రాయడం బాగుంటుంది. తెలుగు భాషను ఎంతో మధురంగా పలికే కోడలు కూడా సుమ అని రాయడం ఇంకా బాగుంటుంది. తెలుగు తియ్యందనాలు పంచి ఇచ్చే కోడలు సుమ అని రాయడంలో ఔన్నత్యం కూడా ఉంది. తెలుగు గొప్పదనం ఓ మలయాళీ ఎంత బాగా ప్రపంచానికి చాటుతున్నారో అని అబ్బురపడడంలో కూడా సుమ గొప్పదనం దాగి ఉంది.
యాంకర్ సుమ, యాక్టర్ సుమ.. ఏది ఇష్టం.. యాంకర్ గా ఉన్న పేరే గొప్పది. వద్దండి యాక్టింగ్ గోల నాకు వద్దు గాక వద్దు అని అంటూ నవ్వులు పువ్వులు పూయిస్తారు. త్వరలోనే జయమ్మ పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుమ పుట్టిన రోజు ఇవాళ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు.
– బ్యూటీ స్పీక్స్ – మన లోకం ప్రత్యేకం