బిగ్‌బాస్.. షో వెనుక కథ.. బిగ్ బ్రదర్‌ ప్లాష్‌ బ్యాక్‌‌

-

తెలుగులో బిగ్‌బాస్ షో వచ్చిన తర్వాతే తెలుగు జనాలకు బిగ్‌బాస్ షో గురించి తెలిసింది కానీ.. అంతకుముందు బిగ్ బాస్ షో అంటే తెలుగు జనాలకు అంతగా తెలియదు. కానీ.. హిందీలో బిగ్‌బాస్ షో పదేండ్ల కిందనే ప్రారంభమయింది. సల్మాన్ ఖాన్ హోస్టుగా ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది బిగ్ బాస్. హిందీ నుంచి తీసుకొని తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో బిగ్‌బాస్ షోను డిజైన్ చేశారు. అయితే.. అసలు బిగ్ బాస్ షోను ఎలా డిజైన్ చేశారో తెలుసా? బిగ్ బాస్ షో హిందీలో రావడానికి కారకులు ఎవరో తెలుసా? బిగ్ బాస్ అనే పేరు పెట్టడానికి కారణం ఎంటో తెలుసా? ఇలా బిగ్ బాస్ షోకు సంబంధించిన అన్ని రకాల డౌట్లకు ఈ వార్తే సమాధానం.

అది 1949 వ సంవత్సరం. యూకేకు చెందిన రచయిత జార్జి ఒర్వెల్ ఓ నవల రాశాడు. దానిపేరు 1984. ఆ నవలలో ఓ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పేరు బిగ్ బ్రదర్. ఆ బిగ్ బ్రదర్ ఓ రాజ్యానికి రాజు. ఆ రాజు ఏది చెబితే అదే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజల మధ్య చిచ్చు పెట్టి వారు కొట్టుకుంటుంటే చూసి ఆనందించడమే ఆయనకు ఇష్టం. ఇలా.. ఆ నవల కొనసాగుతుంటుంది.

అయితే.. ఆ రాజు మాత్రం ఎవ్వరికీ కనిపించడు. కానీ.. జనాలు ఏం చేసేది అంతా రాజుకు ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే.. థాట్ పోలీస్ అనే ఓ నిఘా వ్యవస్థను రాజ్యం మొత్తం మీద ఏర్పాటు చేయిస్తాడు రాజు. దీంతో ఎవరు ఏం మాట్లాడినా వెంటనే రాజుకు తెలియడంతో.. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను వెంటనే బంధించేవారు. రాజు గురించి గొప్పగా మాట్లాడేవాళ్లకు కానుకలిచ్చేవారు. అలా.. అప్పట్లోనే నిఘా నెట్ వర్క్ సహాయంతో ప్రతి ఇంట్లో ఏం జరిగేదో తెలుసుకునేవాడు రాజు. సంక్షిప్తంగా అదీ 1984 నవల స్టోరీ.

కట్ చేస్తే.. డచ్ మీడియా దిగ్గజం జాన్ డీమోల్ జూనియర్.. ఆ నవల చదివాడు. దీంతో నవలలో ఉన్న పాత్రలతో ఓ టీవీ షోను ప్రారంభిస్తే ఎలా ఉంటది అని ఆలోచించాడు. ఆయన అప్పటికే కొన్ని టెలివిజన్ షోలను నిర్మించాడు. అలా.. బిగ్ బ్రదర్ షోను ప్రారంభించారు. 16 మందిని ఓ ఇంట్లో బంధించి వారి బాగోగులు అన్నీ బిగ్ బ్రదర్ చూస్తూ.. వాళ్లందరి మధ్య గొడవలు సృష్టించి దాన్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ రాబట్టి దాన్ని టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. అది జనాల్లోకి వెళ్లడం, సూపర్ హిట్ కావడంతో ఇండియాలో ఎండమోల్ గ్రూప్ దాన్ని అడాప్ట్ చేసుకొని నిర్మాతగా మారి షోను ఇండియా నేటివిటీకి రీడిజైన్ చేసింది. బిగ్ బ్రదర్‌ను కాస్త బిగ్ బాస్‌గా పేరు మార్చింది. అలా హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Latest news