బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ మరోసారి క్యాన్సర్ బారిన పడ్డారు. 2018లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించిన ఆమె దాదాపు ఏడేళ్లుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె మళ్లీ ఈ మహమ్మారి బారిన పడినట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సోమవారం రోజున ప్రపంచ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆరోగ్యం గురించి అప్డేట్ షేర్ చేశారు. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు.
‘ఏడేళ్ల బాధల గురించి, రెగ్యులర్ చెకప్‌లు, మామోగ్రామ్‌ల గురించి అందరితో షేర్ చేసుకుంటూ ఉంటా. అయితే ఇప్పుడు నాకు ఇది రెండో రౌండ్. అయినా నేను మరో యుద్ధానికి రెడీగా ఉన్నా. ఈ వ్యాధితో పోరాడాలని నేను డిసైడ్ అయ్యాను. నాకు మళ్లీ క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి మొహమాటం ఏం లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్యం గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ తహీరా తన పోస్టులో రాసుకొచ్చారు.