పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీటర్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.13, డీజిల్‌పై రూ.10లకు చేరింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి పెంచిన ఎక్సైజ్ డ్యూటీ అమల్లోకి రానుంది.
అయితే పెట్రోల్, డీజిలపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. స్టాక్ మార్కెట్ నష్టాలతో కేంద్ర సర్కార్ సంతృప్తి చెందనట్లు ఉందని వ్యాఖ్యానించింది. అందుకే సామాన్యులకు పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవహరిస్తూ.. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచిందని విమర్శించింది. మరోవైపు ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని చమురు పరిశ్రమలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల వీటి ధరల్లో పెరుగుదల ఉండదని స్పష్టం చేశాయి.