ఒకప్పుడు సినిమా థియేటర్స్ లో వందల రోజుల పాటు ఆడేవి, అయితే రానురాను ఆ పరిస్థితికి తిలోదకాలిచ్చి నేటి పరిస్థితుల్లో ఏదైనా హిట్ సినిమా యాభై రోజులు ఆడడమే గొప్పగా కనపడుతోంది. ఇకపోతే ఏదైనా సినిమా రిలీజ్ అయిన ఒక నెల రోజుల తరువాత అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, వంటి ఓటిటి ప్లేట్ ఫామ్స్ లో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే సమయంలోనే వాటి యొక్క డిజిటల్ హక్కుల అమ్మకం కూడా జరిగిపోతోంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితే సినిమా పరిశ్రమకు ఒకింత ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు.
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో కొత్త రకాల మార్పులు చోటుచేసుకోవడంతో పాటు ఎన్నో రకాల వెరైటీ సినిమాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇక యువ రక్తం ఇండస్ట్రీలోకి వస్తుండడం ఎంతో మంచి విషయం అని, దాని వలన రాబోయే రోజుల్లో మంచి క్వాలిటీ సినిమాలు కూడా అవకాశం ఉందని సురేష్ బాబు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే నేటి సినిమా కేవలం నెల రోజులకు మించి థియేటర్స్ లో ఆడే పరిస్థితి లేదని, ఇక ఫ్లాప్ సినిమాల పరిస్థితి అయితే పది రోజుల లోపే ఉండడం మరింత దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
కాకపోతే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారకతప్పదు, కాబట్టి మన వాళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విధానం వలన, సినిమాలను థియేటర్ లో చూడాలనుకునే ప్రేక్షకులు, ఇప్పటికిపుడు చూడకపోయినా పర్లేదు, మరొక నెలరోజుల్లో హై క్వాలిటీ ప్రింట్ తోనే డీజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చూడొచ్చని భావిస్తున్నారని, ఇది రాబోయే రోజుల్లో కొంత సినిమా పరిశ్రమకు ముప్పుగా కూడా పరిణమించే అవకాశం లేకపోలేదని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. నిన్న మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన సురేష్ బాబు, ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి….!!